సాక్షి, అమరావతి: దేశం పారిశ్రామికంగా, సాంకేతికంగా పురోగమిస్తున్నా వివాహానికి సంబంధించి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా పరిస్థితి ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు ఎంత అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఇప్పటికీ ఆడపిల్లకు 18 ఏళ్ల వయసుకు ముందే తల్లిదండ్రులు పెళ్లి చేసేస్తున్నారు. మన రాష్ట్రంలో 29.3 శాతం మంది అమ్మాయిలకు 18 ఏళ్లు నిండకుండానే వివాహాలు జరుగుతున్నాయి.
వీరిలో 12.6 శాతం మంది అమ్మాయిలు 15 ఏళ్ల నుంచి 19 ఏళ్లలోపే తల్లులు అవుతుండటం గమనార్హం. అలాగే అబ్బాయిలకు 21 ఏళ్లు నిండాకే వివాహం చేయాల్సి ఉండగా ఆ వయసు నిండక ముందే 14.5 శాతం మందికి పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఈ మేరకు తాజాగా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-5)-2019-20 పలు రాష్ట్రాల సూచీలను వెల్లడించింది. చిన్నారుల జననాల నమోదు, నవజాత శిశువుల మరణాల నియంత్రణ వంటి విషయాల్లో ఆంధ్రప్రదేశ్ గణనీయమైన వృద్ధి సాధించినట్టు సర్వే పేర్కొంది. అలాగే సొంతంగా బ్యాంకు ఖాతాలు, మొబైల్ ఫోన్‌లు కలిగిన మహిళల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపింది.
ఊబకాయంతో ఉన్న మహిళల శాతం 36.3 శాతం..
- ఏపీలో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 934 మంది అమ్మాయిలు ఉన్నారు. గత సర్వేలో ఇది 914గా ఉంది.
- ఆస్పత్రుల్లో జరుగుతున్న ప్రసవాలు 96.5 శాతానికి చేరాయి. గతంలో ఇది 91.5గా ఉంది.
- సిజేరియన్ ప్రసవాల సంఖ్య గతంలో కంటే ఇప్పుడు పెరిగింది. ప్రతి వంద సిజేరియన్ ప్రసవాల్లో 63 శాతం ప్రైవేటు ఆస్పత్రుల్లో, 26.6 శాతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరుగుతున్నాయి.
- 36.3 శాతం మంది మహిళలు, 31.1 శాతం మంది పురుషులు ఊబకాయంతో బాధపడుతున్నారు.
- ఐదేళ్లలోపు చిన్నారుల్లో వయసు కంటే తక్కువ బరువుతో 29.6 శాతం మంది ఉన్నారు.
- 15 ఏళ్ల నుంచి 49 ఏళ్లలోపు మహిళల్లో 58.8 శాతం మంది, పురుషుల్లో 16.2 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు.
- రక్తంలో చక్కెర నిల్వలు (షుగర్ 160 కంటే) ఎక్కువగా ఉన్న మహిళలు 10.4 శాతం, పురుషులు 11.4 శాతం మంది ఉన్నారు.
- అధిక రక్తపోటుతో బాధపడుతూ మందులు వాడుతున్నవారిలో 25.3 శాతం మంది మహిళలు, 29 శాతం మంది పురుషులు ఉన్నారు.
- రాష్ట్రంలో సొంతంగా బ్యాంకు ఖాతాలు కలిగి, తమ లావాదేవీలను తామే నిర్వహించుకుంటున్న మహిళలు 81.8 శాతం మంది ఉన్నారు. గతంలో ఇది 66.3 శాతం మాత్రమే.
- గతంలో మొబైల్ వాడుతున్న మహిళలు 36.2 శాతం కాగా, ఇప్పుడా సంఖ్య 48.9 శాతానికి పెరిగింది.
- 21 శాతం మంది మహిళలు ఇంటర్నెట్ వాడుతున్నారు.
వివిధ కేటగిరీల్లో ఇలా..
కేటగిరీ | 2019-20 సర్వే ప్రకారం | 2014-15 ప్రకారం.. |
నవజాత శిశువుల మృతి | 19.9 | 23.6 |
ఏడాదిలోపు శిశువుల మృతి | 30.3 | 34.9 |
తొలి గంటలో తల్లిపాలు ఇస్తున్నవారు | 52.0 | 40.0 |
ప్రసవానికి ప్రభుత్వాస్పత్రులకు వస్తున్నవారు | 50.4 | 38.3 |
హెపటైటిస్-బి వ్యాక్సిన్ వేయించుకుంటున్నవారు | 85.3 | 68.8 |
ప్రభుత్వ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్‌కు వస్తున్నవారు | 94.2 | 91.6 |
ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నవారు | 4.3 | 8.4 |
చిన్నారుల జననాల నమోదు | 92.2 | 82.7 |
Comments
Please login to add a commentAdd a comment