
అనకాపల్లి :మండలంలోని వనుగుపల్లి పంచాయతీ తియ్యగెడ్డ గ్రామంలో హత్యకు గురైన మహిళ కేసును పోలీసులు మూడు రోజుల వ్యవధిలోనే ఛేదించారు. ఈ సంఘటనలో ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు పాడేరు సీఐ సుధాకర్ తెలిపారు. బుధవారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. జి.మాడుగుల మండలం కొరాపల్లి గ్రామానికి చెందిన కొర్రాబు బోడకొండమ్మ అలియాస్ గాయత్రిని అదే పంచాయతీ రూడిబయలు గ్రామానికి చెందిన పాంగి గణపతి అనే వ్యక్తి మూడో భార్యగా పెళ్లి చేసుకునేందుకు పాడేరు మండలం తియగెడ్డ గ్రామంలో తన పిన్ని ఇంటికి తీసుకువెళ్లాడు.
బోడకొండమ్మ అనారోగ్యంతో మృత్యువాత పడిందని దహన సంస్కారాలు పూర్తి చేశామని బోడకొండమ్మ తండ్రి కొరాబు త్రిమూర్తికి గణపతి తెలిపాడు. దీంతో అనుమానం వచ్చిన త్రిమూర్తి ఈ నెల 18న పాడేరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన ఎస్‌ఐ లక్ష్మణరావు ఈ నెల 19న తియగెడ్డ గ్రామానికి వెళ్లి మృతదేహాన్ని పాతి పెట్టిన ప్రదేశాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పాతి పెట్టిన చోట పైన కట్టెలతో కల్చినట్టు గుర్తించిన ఎస్‌ఐ లక్ష్మణరావు విషయాన్ని సీఐ సుధాకర్‌కు నివేదించారు. సీఐ సుధాకర్ పాడేరు తహసీల్దార్‌ను వెంటపెట్టుకొని సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతురాలి మెడ చుట్టూ ఉరి వేసిన గుర్తులు ఉండడాన్ని చూసి హత్య కేసుగా నమోదు చేశారు.
కేసు ధర్యాప్తులో భాగంగా పలు విషయాలు వెలుగు చూసాయి. మొదటి నిందితుడు పాంగి గణపతికి గతంలోనే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. మృతురాలిని మూడో భార్యగా చేసుకుంటానని చెప్పి ఒంగోలులో ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తూ ఆమెతో సహజీవనం చేశాడు. మృతురాలు గణపతిని తన తల్లిదండ్రుల ఇంటికి తీసుకువెళ్లమని చెప్పడంతో ఈ నెల 14న తియగెడ్డ గ్రామంలో గల తన పిన్ని ఇంటికి తీసుకువచ్చాడు.
అక్కడ కూడా ఉండడానికి ఇష్టపడని బోడకొండమ్మ తాను కొరాపల్లిలో తన తల్లిదండ్రుల వద్దకు వెళ్తానని చెప్పింది. అయితే ఆమె ఎక్కడికీ వెళ్లడానికి వీలు లేదని, తనతో ఉండకపోతే చంపేస్తానని గణపతి బెదిరించాడు. అతని మాట వినని బోడకొండమ్మ ఈ నెల 16న ఉదయం 7గంటలకు కొరాపల్లి గ్రామానికి వెళ్లేందుకు సిద్ధపడుతూ ఉండగా ఆమెను చున్నీతో మెడ చుట్టూ గట్టిగా లాగి హత్య చేశాడు. అనంతరం విషయాని తన కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారి సహకారంతో మృతదేహాన్ని గ్రామ శివారులో పాతి పెట్టి సాక్షాలు లేకుండా ప్రయత్నం చేశాడు.
ఈ సంఘటనలో జి.మాడుగుల మండలం కొరాపల్లి పంచాయతీ రూడిబయలు గ్రామానికి చెందిన పాంగి గణపతి, అతనికి సహకరించిన అదే గ్రామానికి చెందిన పాంగి శోభన్, పాంగి మహేష్‌బాబు, పాంగి లక్ష్మమ్మ, పాంగి భారతిలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.