అనకాపల్లిటౌన్ : రెండేళ్ల క్రితం ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన కేసులో నిందితుడిని పట్టుకుని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచినట్టు డీఎస్పీ బి.సుబ్బరాజు చెప్పారు. తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసుకు సంబంధించి ఆయన తెలిపిన వివరాలివి. మండలంలో తగరంపూడి గ్రామానికి చెందిన మైనర్ బాలిక 2021 జూలై 13న రాత్రి నుంచి కనిపించడం లేదంటూ ఆమె తండ్రి నడిగట్ల శ్రీను ఫిర్యాదు మేరకు అదే నెల 15న గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు అందింది.
అస్సాం రాష్ట్రం గౌహతి నుంచి ఎలుసూరి ప్రసాద్‌బాబు అనే వ్యక్తి తగరంపూడిలో తన స్నేహితుని ఇంటికి వచ్చాడు. స్నేహితుడి ద్వారా పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతున్న ఓ మైనర్ బాలిక పరిచయం కావడంతో ఆమెను లోబర్చుకున్న ప్రసాద్‌బాబు అస్సాంకు తీసుకెళ్లిపోయాడు. దీనిపై ఫిర్యాదు అందడంతో నిందితుడి కోసం రెండేళ్లుగా కోల్‌కత్తా, ఒడిశా, తెలంగాణతో పాటు విశాఖపట్నం పలు ప్రాంతాల్లో గాలించారు. ఎట్టకేలకు ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ సమీపంలో ఒక మారుమూల గ్రామంలో మైనర్ బాలికతో కలిసి ప్రసాద్‌బాబు ఉన్నట్టు తెలుసుకున్న ఐటీ కోర్ బృందం ఈ నెల 25న అతడిని భువనేశ్వర్ చందక పోలీస్‌స్టేషన్‌లో హాజరుపరిచి అక్కడ నుంచి అనకాపల్లికి తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు.
మైనర్ బాలిక ప్రస్తుతం మేజర్ కావడంతో చైల్డ్ వెల్ఫేర్ అధికారుల సహకారంతో వైద్యపరీక్షలకు తరలించి కోర్టులో హాజరుపర్చడం జరుగుతుందని చెప్పారు. నిందితుడిని ఈనెల 25న భువనేశ్వర్‌లో అరెస్టు చేసినట్టు డీఎస్పీ చెప్పారు. ప్రసాద్‌బాబుకు గతంలో వివాహమై ఒక పాప ఉంది. అతని తల్లిదండ్రులు గౌహతిలో ప్రభుత్వాస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. అక్కడికి కొద్ది దూరంలో కోడలు కూడా నివసిస్తోంది.
నిందితుడ్ని శనివారం కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించినట్టు డీఎస్పీ చెప్పారు. ఈ సమావేశంలో గ్రామీణ సీఐ ఎ.రవికుమార్, ఎస్‌ఐ సీహెచ్. నర్సింగరావు, అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ హెచ్‌సీ ఎస్.వి.రామకృష్ణ, రూరల్ కానిస్టేబుళ్లు పి.నరేంద్రకుమార్, ఎం.నరేష్, ఐటీకోర్ సిబ్బంది మూర్తి, దిలీప్, గ్రామీణ హెచ్‌సీ జె.రమేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment