పెదమదీనలో అకేషియా తోటల నరికివేత
● క్వారీ లీజు పేరుతో చెట్ల తొలగింపు ● అడ్డుకున్న నాయకులు, గ్రామస్తులు ● టీడీపీ అండతో కలప తరలింపు
బుచ్చెయ్యపేట: మండలంలోని పెదమదీన గ్రామంలో అకేషియా చెట్లను అక్రమంగా నరికి ట్రాక్టర్లతో తరలిస్తుండగా గ్రామస్తులు, నాయకులు అడ్డుకున్నారు. ఇక్కడ రంగరాళ్ల క్వారీకి లీజుకు తీసుకున్న భూమిలో పదేళ్లుగా ఎటువంటి పనులు చేపట్టలేదు. ఇప్పుడు క్వారీ లీజు పేరుతో కొండను ఆనుకుని ఏపుగా పెరిగిన అకేషియా చెట్లను నరికి తరలించడాన్ని గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ, జనసేన, బీజేపీ నాయకులు, తదతరులు అడ్డుకున్నారు. కలపతో ఉన్న ట్రాక్టర్లను గ్రామ రామాలయం వద్దకు తరలించారు. కలప తరలింపునకు ఎవరు అనుమతిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
2013లో గ్రామంలో సర్వే నంబర్ 75, 81లో 75 ఎకరాల భూమిని బీలా శ్రీనివాసరావు పేరు మీద రంగురాళ్ల క్వారీకి లీజుకు ఇచ్చారు. అప్పటి విశాఖ జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, ఆర్డీవో రంగయ్య, తహసీల్దార్ వసంతకుమారి గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. అయితే కొంతమంది రైతులు వ్యతిరేకించినా క్వారీకి అనుమతి ఇచ్చారు. అప్పటి నుంచి క్వారీ నిర్వహణ చేపట్టలేదు. ప్రభుత్వానికి రాయల్టీని కట్టకుండా అక్రమంగా లీజుదారుడు పంచాయతీ అనుమతి లేకుండా చెట్లు నరికి తరలిస్తున్నారని సర్పంచ్ భర్త కేవీఆర్ నాయుడు, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు కె. అచ్చింనాయుడు, జనసేన నాయకుడు కొళ్లమల్ల నాగేశ్వరరావు, బీజేపీ నాయకుడు కోన హేమంత్, వార్డు మెంబర్లు కె. అప్పారావు, దాసి పరదేశినాయుడు, చొప్పా నూకాలు, ఎలిశెట్టి జగదీష్, కె. జోగినాయుడు, కరకపాటి రాము, మూర్తి మహేష్, జల్లూరి అప్పారావు తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే 30 ఎకరాలకుపైగా విస్తీర్ణంలో చెట్లను నరికి పట్టుకుపోయారని వాపోయారు. అటవీ ప్రాంతానికి చెందిన అకేషియా చెట్ల తరలింపునకు ఎటువంటి అనుమతులు లేకుండా వందలాది ట్రాక్టర్లపై నరికి పట్టుకుపోతున్నారని, ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహించారు. క్వారీ లీజుదారుడు వెనుక అధికార పార్టీ నాయకులు అండ ఉండటంతోనే అధికారులు చోద్యం చూస్తున్నారన్నారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి కలప తరలించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై తహసీల్దార్ లక్ష్మిని వివరణ కోరడానికి ప్రయత్నించగా ఆమె స్పందించలేదు. డిప్యూటీ తహసీల్దార్ మురళిని వివరణ కోరగా తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment