పెదబొడ్డేపల్లిలో భారీ చోరీ
నర్సీపట్నం: మున్సిపాలిటీలోని పెదబొడ్డేపల్లి శ్రీరామనగర్ కాలనీలో భారీ చోరీ జరిగింది. విద్యుత్ లైన్‌మన్ కాళ్ల రాంజీ ఇంటి తాళాలను గుర్తుతెలియని వ్యక్తులు పగులగొట్టి బీరువాలో ఉంచిన 14 తులాల బంగారు ఆభరణాలు, రూ.10 వేలు ఎత్తుకుపోయారు. బాధితుడు కథనం ప్రకారం.. శ్రీరామనగర్‌లో నివాసముంటున్న రాంజీ రోలుగుంట మండలం కొండపాలెం లైన్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్నాడు. రాత్రి 10 గంటల వరకు ఇంట్లో గడిపి, పడుకునేందుకు అక్కడ సమీపంలో అత్తవారింటికి భార్యాపిల్లలతో వెళ్లారు. ఇది గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు రాత్రికి తలుపు గడియ విరగ్గొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. దీనికి ముందు పక్క పోర్షన్‌లో నివాసం ఉంటున్న వారు బయటకు రాకుండా తలుపు గడియ పెట్టారు. తర్వాత బాధిత ఇంట్లోకి ప్రవేశించి బీరువా తాళాలు విరగ్గొట్టి, అందులోని మూడు తులాలు మంగళ సూత్రాలు, ఐదు ఉంగరాలు, ఆరు చైన్లు, మూడు తులాల హారం, తులం నెక్లెస్, తులం చెవిదిద్దులు, తులం బ్రాస్‌లైట్ మొత్తం 14 తులాల ఆభరణాలతో పాటు రూ.10 వేలు పట్టుకుపోయారు. విధులకు వెళ్లేందుకు ఉదయం వచ్చి చూసేసరికి తలుపు గడియ విరగ్గొట్టేసి ఉండటం చూసి షాక్‌కు గురయ్యాడు. ఇంట్లోకి వెళ్లి చూడగా బట్టలు, వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బీరువాలో నగలు, డబ్బు లేకపోవడంతో బాధితుడు వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ గోవిందరావు చోరీ జరిగిన ఇంటిని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు అనకాపల్లి క్లూస్ టీంను రప్పించి వేలిముద్రలు సేకరించారు. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు.
14 తులాల బంగారు ఆభరణాలు అపహరణ
Comments
Please login to add a commentAdd a comment