అడ్డదారిలో భూ సేకరణ
సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతర్
నోటిఫికేషన్ లేకుండా భూసేకరణ
రైతులపై కూటమి ప్రభుత్వం కుట్ర
నేరుగారైతులతో మంతనాలు
ఇలా అయితే నష్టపోతామంటున్న రైతులు
ప్యాకేజీ ఎగ్గొట్టేందుకే డైరెక్ట్ పర్చేజింగ్
బోదిగల్లంలో భూములు రిజిస్ట్రేషన్ జరుగుతున్నసబ్‌రిజిస్టార్ కార్యాలయం
నక్కపల్లి: రాజయ్యపేట, చందనాడ, బోయపాడు, అమలాపురం గ్రామాల సమీపంలో ప్రభుత్వం బల్క్‌డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తోంది. గతంలో రైతుల నుంచి సేకరించిన 4500 ఎకరాల్లో 2 వేల ఎకరాలను ఈ పార్క్ కోసం కేటాయించారు. పార్క్ నిర్మాణానికి గత నెలలో ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయడంతో నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ఈ పార్క్ నిర్మాణంలో భాగంగా పాటిమీద, మూలపర, తమ్మయ్యపేట, రాజయ్యపేటలో కొంత నివాస ప్రాంతాలను ఖాళీ చేయించాల్సి ఉంది. ఏపీఐఐసీకి భూములు, నివాస ప్రాంతాలను ఇచ్చిన వారికి వేరొక చోట పునరావాసం కల్పించాలి. ఇలా బల్క్ డ్రగ్ పార్క్ ప్రభావిత ప్రాంతాల్లో సుమారు వెయ్యి మందికి వేరొక చోట ఇళ్ల స్థలాలు కేటాయించి ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలి. వీరికి పునరావాసం కోసం పెదబోదిగల్లంలో సుమారు 170 ఎకరాలను గుర్తించారు. ఈ భూములను ప్రభుత్వం డైరెక్ట్ పర్చేజింగ్ పేరుతో కొనుగోలు చేస్తోంది. కంపెనీ అవసరాలు, నిర్వాసితులకు పునరావాసం కోసం భూములు తీసుకోదలిస్తే ముందుగా 4 (1) నోటిఫికేషన్ విడుదల చేయాలి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 2013 భూసేకరణ చట్టం ప్రకారం మద్దతు ధర నిర్ణయించి, అక్కడ ఉన్న మార్కెట్ విలువకు మూడు నుంచి ఐదు రెట్లు అధికంగా నష్టపరిహారం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, ఇంటి స్థలం, మేజర్లకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. రైతుల ఆమోదంతో అవార్డు పాస్ చేయాలి. ఇవన్నీ చేయాలంటే బోదిగల్లంలో రైతులకు ఎకరాకు సుమారు రూ.70 లక్షల నుంచి రూ.80 లక్షలు ముట్టజెప్పాల్సి ఉంటుంది. కాని ప్రభుత్వం రైతులకు అన్యాయం తలపెడుతూ వారితో నేరుగా బేరసారాలు సాగించి ఎకరాకు రూ.30 లక్షల నష్టపరిహారం చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ధరకు మీరు భూములు ఇస్తే సరే సరి.. లేకపోతే బలవంతంగా భూములు తీసేసుకుని నష్టపరిహారం కోర్టులో జమ చేస్తామని బెదిరించడంతో గత్యంతరం లేక కొంతమంది రైతులు భూములు ఇచ్చేందుకు అంగీకరించారు. 170 ఎకరాలకు గాను సుమారు 80 ఎకరాలకు సంబంధించి రైతులు తమ అంగీకారం తెలపగా, దాదాపు 25 ఎకరాలకు పైగా భూములను ప్రభుత్వం రైతులకు నేరుగా నష్టపరిహారం చెల్లించి ఏపీఐఐసీ పేరున రిజిస్ట్రేషన్ చేయించుకుంది. మిగిలిన భూములను రైతులు ఇవ్వాలా వద్దా అనే ఆలోచనలో పడ్డారు. వీరిలో కొంతమంది కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు సమాచారం. కేవలం పరిహారం మాత్రమే చెల్లించి ప్యాకేజీ ఇతర సదుపాయాలు కల్పించకుండా భూములు ఇవ్వాలని ఒత్తిడి చేయడం అన్యాయమంటూ కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాలుగులైన్ల రోడ్ల నిర్మాణానికీ అదే పరిస్థితి
ఏపీఐఐసీ వారు ఏర్పాటు చేసే ప్రత్యేక ఆర్థిక మండలి, బల్క్‌డ్రగ్‌పార్క్ కోసం జాతీయరహదారి కాగిత నుంచి వేంపాడు, అమలాపురం మీదుగా బోయపాడు వరకు నాలుగు లైన్ల (150 అడుగుల) రహదారిని నిర్మించాల్సి ఉంది. దీని కోసం సుమారు 60 ఎకరాల భూములు అవసరం. కాగితలో జిరాయితీ భూములకు రూ.60 లక్షల చొప్పున డైరెక్ట్ పర్జేజింగ్ విధానంలో కొనుగోలు చేసి నష్టపరిహారం చెల్లించారు. వీరి భూముల్లో ఉన్న ఫలసాయానికి ఎటువంటి పరిహారం చెల్లించలేదు. మామిడి, జీడి, కొబ్బరి చెట్లకు సంబంధించిన పరిహారం ఇంతవరకు ఇవ్వలేదని రైతులు వాపోతున్నారు. ఇక ఇక్కడ డీఫారం, ప్రభుత్వ భూములు కలిపి సుమారు 20 ఎకరాలు ఉంది. కాగితలో మార్కెట్ విలువ రూ.12 లక్షలు, న్యాయంపూడిలో రూ.18 లక్షలు, వేంపాడులో రూ.18 లక్షలు ఉందని అధికారులు చెబుతున్నారు. డీఫారం రైతులకు ఎకరాకు రూ.30 లక్షలు, సాగు భూములకు ఎకరాకు రూ.12 లక్షలు చెల్లిస్తామని చెబుతున్నారు. రైతులు మాత్రం డీఫారం రైతులకు కూడా జిరాయితీతో సమానంగా రూ.60 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. రూ.30 లక్షల కంటే ఎక్కువ ఇచ్చేది లేదని, పరిహారం కోర్టులో జమ చేస్తామని అధికారులు బెదిరిస్తున్నారంటూ రైతులు వాపోతున్నారు. ఇక్కడ కూడా భూసేకరణ నోటిఫికేషన్ లేకుండానే భూములు తీసుకోవడం గమనార్హం. ఇలా డైరెక్ట్ పర్చేజింగ్ విధానంలో అయితే రైతులు కేవలం నష్టపరిహారంతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. కంపెనీల అవసరాలు, పునరావాసం కోసం సేకరించే భూములకు సంబంధించి నష్టపరిహారం చెల్లింపుల్లో ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని, రైతులకు అన్యాయం తలపెడుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అడ్డదారిలో భూ సేకరణ
అడ్డదారిలో భూ సేకరణ
Comments
Please login to add a commentAdd a comment