ప్రజల భాగస్వామ్యంతోనే పారిశుధ్యం మెరుగు
గాంధీ విగ్రహం వద్ద స్వచ్ఛ భారత్‌పై ప్రతిజ్ఞ చేస్తున్న నాగలక్ష్మి, డీపీవో శిరీషారాణి
కె.కోటపాడు : పారిశుధ్య సిబ్బంది, క్లాప్‌మిత్రలకు తడి, పొడి చెత్తను వేర్వేరు డస్ట్‌బిన్‌లలో వేసి ఇచ్చి పారిశుధ్యం మెరుగుకు ప్రజలు సహకరించాలని జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం ప్రిన్సిపాల్ నాగలక్ష్మి, అనకాపల్లి జిల్లా పంచాయతీ అధికారి శిరీషారాణి అన్నారు. అనకాపల్లి డివిజన్‌లో గల 11 మండలాల్లో గల పంచాయతీ విస్తరణాధికారులు, ఆయా మండలాల్లో ఎంపిక చేసిన పంచాయతీ కార్యదర్శిలు, క్లాప్‌మిత్రలకు చౌడువాడలో సోమవారం చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల నిర్వహణపై ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగలక్ష్మి, శిరీషారాణి మాట్లాడుతు గ్రామాల్లో సేకరించిన చెత్తను సంపద తయారీ కేంద్రాల్లో వేర్వేరుగా ఉంచాలని తెలిపారు. పాడి రైతుల నుంచి సేకరించిన పేడను సంపద తయారీ కేంద్రాల్లో 70 నుంచి 80 రోజుల పాటు ఉంచిన తరువాత వర్మీగా తయారవుతుందన్నారు. ఈ ఎరువును రైతులకు కిలో గరిష్టంగా రూ.5లకు అమ్మకాలను చేపట్టడం ద్వారా పంచాయతీకి ఆదాయం లభిస్తుందన్నారు. భూమిలో వర్మీకంపోస్టు వేయడం వల్ల భూమిలో పోషక విలువలు పెరుగుతాయని, తద్వారా మంచి దిగుబడితో పాటు ఆరోగ్యకరమైన పంట లభిస్తుందని తెలిపారు. శిక్షణ కార్యక్రమానికి హాజరైన ఈవోఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు, క్లాప్‌మిత్రలను గ్రామంలో పర్యటించి ప్రజలకు ఏ విధంగా తడి, పొడి చెత్తను వేరువేరుగా ఇవ్వాలో వివరింపజేసారు. అంతకుముందు సంపద తయారీ కేంద్రం వద్ద గల గాంధీ విగ్రహానికి పూలమాలను వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సాంబశివరావు, సర్పంచ్ దాడి ఎరుకునాయుడు, పంచాయతీ కార్యదర్శి బి.సురేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment