గంగమ్మ గలగలలు
తుపానులు కురిపించిన వరుస వానలతో జిల్లాలో భూగర్భ జలాలు మెరుగుపడ్డాయి. సగటున జిల్లా మొత్తం 0.71 మీటర్ల మేర నీటిమట్టం పెరిగింది. కొన్ని మండలాలు, ప్రాంతాల్లో అయితే ఈ పెరుగుదల గణనీయంగా ఉంది. జనవరి మాసాంతానికి భూగర్భ జల గణాంకాల శాఖ తీసిన తాజా లెక్కల ప్రకారం జలమట్టంలో పెరుగుదల నమోదైంది. జిల్లాలో దేవరాపల్లి మండలం తామరబ్బ గ్రామం వద్ద అత్యధికంగా 21.41 మీటర్ల లోతులో జలాలు ఉండగా, కశింకోట మండలం ఏఎస్ పేట గ్రామం వద్ద కేవలం 0.45 మీటర్ల లోతులోనే జలసిరి అందుబాటులో ఉన్నట్టు అధికారులు నమోదు చేశారు.
యలమంచిలి రూరల్: జిల్లాలో గత మూడేళ్లుగా వర్షాలు సమృద్ధిగా కురవడం, నదులు, కాలువలు, నిండుగా ప్రవహించడం, చెరువులు నీటితో నిండటంతో భూగర్భ జలాలు ౖపైపెనే దొరుకుతున్నాయి. దానికితోడు డిసెంబరులో కురిసిన వర్షాలతో నీటిమట్టాలు మరింత మెరుగుపడ్డాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వర్ష రూపంలో వచ్చే ప్రతి నీటి బొట్టును ఒడిసిపడుతూ భూమిలో ఇంకేలా జలసంరక్షణ చర్యలు చేపట్టింది. ముఖ్యంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లావ్యాప్తంగా జలసంరక్షణ పనులకు ప్రాధాన్యమిచ్చారు. గ్రామాల్లో, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో వర్షపునీరు భూమిలో ఇంకేలా పెద్ద సంఖ్యలో ఇంకుడుగుంతల నిర్మాణం సైతం చేపట్టారు. ఇది సత్ఫలితాలు ఇవ్వడంతో భూగర్భ జలమట్టం ౖపైపెకి ఎగబాకడానికి దోహదపడింది. దీంతోపాటు వరుణుడు కరుణిస్తుండటంతో పాతాళగంగ పదిలంగా ఉంది. 2019 ఖరీఫ్ సీజన్ నుంచి ఏటా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో అన్ని ప్రాంతాల్లోని చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల్లో నీరు పుష్కలంగా ఉంటోంది. ఈ ఏడాది జిల్లాలో 1163.2 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదు కావడంతో భూగర్భజలాలు ఆశాజనకంగా ఉన్నాయి. జిల్లా సాధారణ వర్షపాతం 997.48 మిల్లీమీటర్లు కాగా ఈ ఏడాది 16.61 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా గత డిసెంబరు నెలలో తుపాను ప్రభావంతో జిల్లావ్యాప్తంగా సుమారు 10 రోజులు వర్షాలు స్థిరంగా కురిశాయి. ఒకేసారి భారీ వర్షం కాకుండా నెమ్మదిగా వర్షం కురవడం వలన వర్షపునీరు భూమిలో ఇంకే శాతం ఎక్కువగా ఉంటుందని భూగర్భ జలవనరుల శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా ఈ వేసవిలో తాగు, సాగునీటి ఇబ్బందులకు ఆస్కారమే ఉండదని అధికారులు చెబుతున్నారు.
జల సంరక్షణ పనులు ముమ్మరం కావాలి
భూగర్భ జలాల వినియోగం 70 శాతం వరకు మాత్రమే ఉండాలి. అంతకు మించి ఉంటే ఆయా ప్రాంతాలను సమస్యాత్మకమైనవిగా భూగర్భ జలవనరుల శాఖ అధికారులు పరిగణిస్తారు. 90 నుంచి 100 శాతం వరకు ఉంటే అత్యంత సమస్యాత్మకమైన గ్రామాలుగా గుర్తిస్తారు. జిల్లాలో 27 శాతం మాత్రమే జలాలను వినియోగిస్తున్నారు. దీంతో సమీప భవిష్యత్తులో జిల్లావాసులకు భూగర్భ జలాల విషయంలో ఎటువంటి సమస్య వచ్చే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. అయితే జిల్లాలో వర్షపు నీరు 9 శాతం మాత్రమే భూమిలోకి ఇంకుతోంది. మిగిలిన 91 శాతం వివిధ రూపాల్లో వృథా అవుతోంది. వర్షపు నీరు వృథా కాకుండా జల సంరక్షణ పనులు పెద్ద ఎత్తున చేపట్టాల్సి ఉంది. జిల్లాలో కురిసిన వర్షాల ద్వారా ఉత్పన్నమైన నీటిలో 41 శాతం నీరు ఆవిరి అవుతుండగా మరో 40 శాతం నీరు వృథాగా పోతోంది. కొంత శాతం నీరు తేమగా మారుతున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భూగర్భజలాల వృద్ధికి జల సంరక్షణ పనులు మరింత ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది.
యలమంచిలి మండలం పులపర్తి సమీపంలో పంట పొలంలో బోరు నుంచి ఉబికి వస్తున్న నీరు
దేవరాపల్లిలో భూగర్భ జలమట్టాన్ని లెక్కగడుతున్న అధికారులు
వివిధ మండలాల్లో భూగర్భ జలమట్టాలు ఇలా..
మండలం నీటిమట్టం (మీటర్లలో)
అనకాపల్లి 3.83
అచ్యుతాపురం 15.81
యలమంచిలి 1.37
బుచ్చెయ్యపేట 3.41
మాకవరపాలెం 2.38
చీడికాడ 1.09
చోడవరం 1.59
దేవరాపల్లి 2.93
గొలుగొండ 3.36
కె.కోటపాడు 1.84
కశింకోట 0.45
మునగపాక 2.34
నక్కపల్లి 1.92
నర్సీపట్నం 0.72
నాతవరం 2.52
పరవాడ 3.15
పాయకరావుపేట 2.21
రాంబిల్లి 0.94
రావికమతం 2.69
రోలుగుంట 1.92
ఎస్.రాయవరం 0.47
సబ్బవరం 1.91
వి.మాడుగుల 1.50
యలమంచిలి 4.99
ప్రతి నెల భూగర్భజల మట్టాలను సంబంధిత అధికారులు అంచనా వేస్తారు. జిల్లాలో 81 పీజియో మీటర్లతో తీసిన లెక్కల ప్రకారం జనవరి నెలలో సగటున 4.83 మీటర్ల ఎత్తులో భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నట్టు తేలింది. గత ఏడాది మే నెలలో సగటున 8 మీటర్ల లోతులో భూగర్భ జలం లభించేది. గతేడాది మే నెలతో పోల్చితే ప్రస్తుతం జిల్లాలో భూగర్భ జలమట్టం 3.17 మీటర్ల్ల పైకి ఎగబాకింది. జిల్లాలో గతంతో పోలిస్తే ఈ ఏడాది భూగర్భజలాలు ఆశాజనకంగా ఉన్నాయి. కశింకోట మండలం ఏఎస్ పేటలో రాంకో సిమెంటు కర్మాగారం పరిసరాల్లో కేవలం 0.45 మీటర్లు, ఎస్.రాయవరం మండలం ఆర్.కొత్తూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద 0.47 మీటర్లు, నర్సీపట్నం ఎంపీడీవో కార్యాలయం వద్ద 0.72 మీటర్లు, రాంబిల్లి మండలం లాలంకోడూరు ఎస్సీ కాలనీ సామాజిక భవనం వద్ద 0.94 మీటర్ల లోతులోనే జలసిరి అందుబాటులో ఉండడం విశేషం. ఇవి కాకుండా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో 12 చోట్ల 2 మీటర్లలోపే నీరు లభ్యమౌతుండటం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా బావుల నుంచి నీరు సమృద్ధిగా వస్తుండటంతో ఈ ఏడాది వ్యవసాయ, ఉద్యాన పంటల సేద్యపు పనులకు ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు.
మెరుగ్గా భూగర్భ జలాలు
జిల్లాలో మూడేళ్లగా సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. గత డిసెంబరులో తుపాను ప్రభావంతో జిల్లావ్యాప్తంగా వర్షాలు కురవడంతో భూగర్భ నీటిమట్టాలు పెరిగాయి. ఈ వేసవి మూడు నెలల్లో ఏవిధమైన ఇబ్బంది ఉండదు. గత నాలుగేళ్లలో వేసవిలో ఎటువంటి సమస్య ఎదురుకాలేదు. జిల్లా వ్యాప్తంగా నీటి లభ్యతకు ఎటువంటి సమస్య లేదు. అయినప్పటికీ భూగర్భ జలాలను వృథా చేయకుండా అవసరం మేరకు వినియోగించుకుని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.
–జి.శ్రీనివాసరావు, డిప్యూటీ డైరెక్టర్, భూగర్భ జలగణన శాఖ, అనకాపల్లి
గంగమ్మ గలగలలు
గంగమ్మ గలగలలు
గంగమ్మ గలగలలు
గంగమ్మ గలగలలు
Comments
Please login to add a commentAdd a comment