కాసులిస్తేనే కరెంట్ కనెక్షన్.!
● కొత్త మీటర్ కావాలంటే విద్యుత్ అధికారుల చేయి తడపాల్సిందే.. ● కూటమి నేతలతో కలిసి బరితెగిస్తున్న ఈపీడీసీఎల్ సిబ్బంది ● కొత్త కనెక్షన్ల కోసం వేల సంఖ్యలో దరఖాస్తులు ● అపార్ట్‌మెంట్ కనెక్షన్‌కు రూ.50 వేలు, వ్యక్తిగత కనెక్షన్‌కు రూ.5 వేల వసూలు
సార్.. కొత్తగా ఇల్లు కట్టుకున్నాం.. కరెంట్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నాం.. ఎప్పుడు వస్తుందని.. ఎవరైనా సాధారణ ప్రజలు అడిగితే.. ‘మీ లోకల్ లీడర్ నుంచి సిఫార్సు తీసుకురా.. అప్పుడే పని త్వరగా పూర్తవుతుంది. దాంతో పాటు ఎంతో కొంత సర్దుబాటు చెయ్.. మీ ఇంటికి వెలుగులు వచ్చేస్తాయి.’
– ఈపీడీసీఎల్ విశాఖపట్నం సర్కిల్ పరిధిలోని అధికారులు, సిబ్బంది చెబుతున్న మాటలు ఇవి.
జోన్–1 పరిధిలో 80 అడుగుల రోడ్డు ప్రాంతానికి చెందిన ప్రసన్నకుమార్ కొత్తగా కడుతున్న గ్రూప్ హౌస్ కోసం విద్యుత్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేశారు. నెల రోజులైనా స్పందన రాకపోవడంతో విశాఖ సర్కిల్ కార్యాలయానికి వెళ్లి అడగ్గా.. దిగువ స్థాయి అధికారిని సంప్రదించాలని చెప్పారు. తిరిగి తిరిగి సదరు అధికారిని అడగ్గా.. మీ లోకల్ టీడీపీ లీడర్ నుంచి ఒక్క ఫోన్ చేయించండి చాలు.. మీ పనైపోతుందని అన్నారు. లీడర్ దగ్గరికి వెళ్లి బతిమిలాడారు. అక్కడి నుంచి జోన్ సిబ్బందికి ఫోన్ వెళ్లింది. వెంటనే సదరు విద్యుత్ ఉద్యోగి ప్రత్యక్షమై.. ఫార్మాలిటీస్ ఉన్నాయంటూ లెక్క చెప్పి రూ.50 వేలు కప్పం కట్టించుకున్నారు. అంతే రెండు రోజుల్లో కొత్త కనెక్షన్ వచ్చేసింది.
– ఇదీ కొంత కాలంగా ఈపీడీసీఎల్ విశాఖ సర్కిల్‌లో నడుస్తున్న దందా. కొత్త విద్యుత్ కనెక్షన్ కావాలంటే.. కచ్చితంగా ఆ ఏరియాకు చెందిన కూటమినేత నుంచి ఫోన్ రావాల్సిందే.
సాక్షి, విశాఖపట్నం :
ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలో ప్రస్తుతం 18,42,691 మంది ఎల్‌టీ కేటగిరీ వినియోగదారులు, 1858 హెచ్‌టీ కేటగిరీ వినియోగదారులున్నారు. గత ఐదేళ్ల కాలంలో కొత్త విద్యుత్ కనెక్షన్ కావాలంటే సులువుగా దొరికేది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నా.. స్థానిక ఏఈ కార్యాలయంలో సంప్రదించినా.. కేటగిరీల వారీగా ఫీజులు చెల్లించేవారు. నిర్ణీత గడువులో కొత్త కనెక్షన్ మంజూరయ్యేది. 2022 నుంచి 2024 ఏప్రిల్ మధ్య కాలంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో దాదాపు 80 వేల కొత్త కనెక్షన్లు పెరిగాయి. కానీ.. ఎక్కడా లంచాలకు తావులేకుండా మంజూరు చేసేవారు. ఇప్పుడు కాలం మారిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈపీడీసీఎల్ సర్కిల్ అధికారులు కమర్షియల్‌గా మారిపోయారు. కనెక్షన్ కావాలంటే చేయి తడపాల్సిందేనని భీష్మించుకు కూర్చుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక లైన్‌మెన్‌లు, ఏఈలు దరఖాస్తులను ప్రాసెసింగ్ చేస్తున్నా.. వాటిని ఆపాలంటూ కూటమి నేతలు హుకుం జారీ చేస్తున్నారని తెలుస్తోంది. తమ ఆదేశాలు వచ్చేంత వరకూ కొత్త దరఖాస్తుల జోలికి వెళ్లొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంట. అందుకే విశాఖ సర్కిల్ పరిధిలో వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
కూటమి నేతలతో కుమ్మక్కు!
విద్యుత్ కనెక్షన్లు ఏమైనా కొత్తవి మంజూరు చేయాలంటే కచ్చితంగా తమను సంప్రదించేలా చూడాలంటూ కూటమి నేతలు విశాఖపట్నం సర్కిల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఏ దరఖాస్తు వచ్చినా దానిపై దృష్టి సారించడం లేదు. దరఖాస్తుదారులు వచ్చి తమ కొత్త కనెక్షన్ గురించి అడిగితే... కూటమి నేతలతో కుమ్మకై ్క అందినకాడికి దోచుకుంటూ పంచుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. వ్యక్తిగత కనెక్షన్‌కు కేటగిరీ బట్టి రూ.5 నుంచి రూ.10 వేలు.. అపార్ట్‌మెంట్స్, విల్లాలు, గ్రూప్‌హౌస్‌లకు విస్తీర్ణం, ఫ్లాట్లను బట్టి రూ.50 వేల నుంచి రూ.లక్ష కుపైగా రేటు ఫిక్స్ చేశారని తెలుస్తోంది. దీంతో ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్కరికీ విద్యుత్ కచ్చితంగా అవసరం కాబట్టి.. ఎంత డిమాండ్ చేస్తే అంత చెల్లింపులు చేసి కనెక్షన్ తీసుకుంటున్నామని వినియోగదారులు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment