అతివలకు అండగా ‘సఖి’
● బాధితులకు ఆశ్రయం, న్యాయసహాయం ● కౌన్సెలింగ్ ద్వారా సమస్యల పరిష్కారానికి యత్నం ● ఎస్పీ తుహిన్ సిన్హా
అనకాపల్లి: అతివలకు అండగా సఖి వన్ స్టాప్ సెంటర్ ఉంటుందని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రి సమీపంలో ఉన్న ఈ సెంటర్‌ను సోమవారం రాత్రి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లైంగిక వేధింపులు, గృహ హింస, బాల్య వివాహాలు, వరకట్న వేధింపులు, మహిళల అక్రమ రవాణా, సోషల్ వెబ్‌సైట్ల ద్వారా జరిపే నేరాలు, పనిచేసే ప్రదేశంలో మహిళలపై వేధింపులు, తల్లిదండ్రుల నిర్లక్ష్యం తదితర ఫిర్యాదులపై మహిళలు నిర్భయంగా 181కు కాల్ చెయ్యవచ్చునని చెప్పారు. ఫిర్యాదు తీవ్రతను బట్టి సఖి కేంద్రంలో సైకో సోషల్ కౌన్సెలింగ్, లీగల్ కౌన్సెలింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. సెంటర్‌లో పోలీసు, వైద్య, న్యాయ, మహిళా శిశు సంక్షేమ విభాగాలకు చెందిన సిబ్బంది విధులు నిర్వహిస్తారన్నారు. 5 నుంచి 10 రోజుల వరకు ఆశ్రయం కల్పిస్తామని, భోజనం ఇతర వసతులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అనకాపల్లి మహిళా పోలీస్ స్టేషన్ సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐలు యమున, ఈశ్వరరావు, సఖి వన్‌స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ ఎం.వి.మంజులవాణి, నోడల్ అధికారి ఎల్.సుజాత పాల్గొన్నారు.
సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన
కశింకోట: సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఎస్పీ తుహిన్ సిన్హా పోలీసు అధికారులను ఆదేశించారు. కశింకోట పోలీసు స్టేషన్‌ను సోమవారం ఆకస్మికంగా సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. కేసుల పురోగతిని పరిశీలించారు. సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్నాయని, వాటి పట్ల ప్రజలను మరింత అప్రమత్తం చేయాల్సి ఉందన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసులు నమోదు చేయాలన్నారు. గంజాయి అక్రమ రవాణాను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అసాంఘిక కార్యకలాపాల నిరోధానికి ప్రధాన కూడళ్లు, కీలక ప్రాంతాల్లో సీసీ టీవీ కెమెరాలను దాతల సహకారంతో ఏర్పాటు చేయాలన్నారు. సీఐ అల్లు స్వామినాయుడు, ఎస్‌ఐ మనోజ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment