ఉపమాకలో తిరుమల దర్శన కౌంటర్
● టీటీడీ చైర్మన్‌ను కోరిన హోం మంత్రి అనిత
టీటీడీ చైర్మన్‌కు వినతిపత్రం ఇస్తున్న హోం మంత్రి అనిత
నక్కపల్లి: టీటీడీ అనుబంధ ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో తిరుమల దర్శన టికెట్లు విక్రయించే కౌంటరు ఏర్పాటు చేయాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును హోం మంత్రి వంగలపూడి అనిత కోరారు. సోమవారం ఆమె స్థానిక నాయకులతో టీటీడీ చైర్మన్‌ను కలిశారు. మార్చి 10న ప్రారంభమయ్యే ఉపమాక వెంకన్న వార్షిక కల్యాణోత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ఉపమాక ఆలయాన్ని టీటీడీ దత్తత తీసుకునే సమయంలో ఇచ్చిన హామీల అమలు గురించి వివరించారు. ఆలయానికి వచ్చే ఉత్తరాంధ్ర భక్తుల కోసం ఉపమాకలో టీటీడీ ఆధ్వర్యంలో టికెట్ కౌంటర్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విక్రయించే అవకాశం కల్పించాలని కోరారు. ఇక్కడ లడ్డూ విక్రయాలు నిరంతరం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపమాక కల్యాణోత్సవాలకు రావాల్సిందిగా టీటీడీ చైర్మన్ నాయుడును కోరామన్నారు. తమ ప్రతిపాదనలపై వెంటనే స్పందించిన చైర్మన్ టీటీడీ చీఫ్ ఇంజినీర్, జేఈవోలను రప్పించి ఉపమాకలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారన్నారు. హోమ్ మంత్రి వెంట టీడీపీ మండల అధ్యక్షుడు కొప్పిశెట్టి వెంకటేష్, ఉపమాక దేవస్థానం మాజీ చైర్మన్‌లు కొప్పిశెట్టి కొండబాబు, కొప్పిశెట్టి బుజ్జి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment