గంజాయి నిర్మూలనలో కూటమి ప్రభుత్వం విఫలం
● ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకన్న
దేవరాపల్లి: గంజాయి నిర్మూలనలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.వెంకన్న సోమవారం ఓ ప్రకటనలో విమర్శించారు. విశాఖ సెంట్రల్ జైలు కెపాసిటీ సుమారు 1300 కాగా, అక్కడ 2వేల మంది ఖైదీలు ఉన్నారన్నారు. అందులో 1200 మందికి పైబడి గంజాయి కేసుల్లో పట్టుబడిన అమాయక గిరిజనులేనన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని ప్రకటించినా క్షేత్ర స్థాయిలో అమలుకు నోచుకోవడం లేదన్నారు. మాదక ద్రవ్యాల మత్తుకు యువత బానిసవుతుందని, వీటిని నిర్మూలించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధి కనబరచడం లేదని ఆరోపించారు. ప్రజల భాగస్వామ్యంతో డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపడం ద్వారానే నియంత్రణ సాధ్యపడుతుందన్నారు. తక్కువ శ్రమతో ఎక్కువ ఆదాయం వస్తుందని ఆశ చూపి గంజాయి రవాణాలో గిరిజన యువతను వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment