ఏయూలో పేలవంగా వజ్రోత్సవాలు
విశాఖ విద్య: ఆంధ్ర యూనివర్సిటీ జియో ఫిజిక్స్ విభాగం వజ్రోత్సవాలు పేలవంగా సాగుతున్నాయి. వర్సిటీలో జియో ఫిజిక్స్ విభాగం ఏర్పాటై 75 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో మూడు రోజుల పాటు ప్లాటినం జూబ్లీ ఉత్సవాల నిర్వహణకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. మొదటి రోజు ప్రారంభ వేడుక డాక్టర్ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో అట్టహాసంగా జరిగింది. రెండో రోజు మంగళవారం ఈ కార్యక్రమాన్ని వర్సిటీలోని జియో ఫిజిక్స్ బ్లాక్‌కు మార్చారు. రెండు హాళ్లలో సెమినార్లు కొనసాగేలా షెడ్యూల్ ఇచ్చారు. ఉపన్యాసాలు ఇచ్చే వారికి, ఆహూతులకు తగిన ఏర్పాట్లు చేశారు. అయితే ఒక హాల్లో మాత్రమే సెమినార్ నిర్వహించగా, రెండో హాల్ నిరుపయోగంగా వదిలేశారు. రెండో హాల్లో సెమినార్ ఇవ్వాల్సిన పలువురు విద్యావేత్తలు, విషయం తెలియక అక్కడే చాలా సేపు కూర్చున్నారు. మధ్యాహ్నం వరకు ఒకే హాల్లో సెమినార్ కొనసాగగా, దానికి కూడా పూర్తి స్థాయిలో ఆహూతులు లేక కుర్చీలు ఖాళీగానే కనిపించాయి. సబ్జెక్టు పరంగా ఎంతో నిష్ణాతులైన వారు తమ అభిప్రాయాలు, అనుభవాలను పంచుకునే సమయంలో, వీటిని సద్వినియోగం చేసుకునే రీతిలో విద్యార్థులనైనా భాగస్వాములను చేయకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. విభాగం భవనం ముందు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను మధ్యాహ్నం వరకు 58 మంది మాత్రమే సందర్శించారు. మధ్యాహ్నం తరువాత ఏవీఎన్ కాలేజీ విద్యార్థులు తిలకించేందుకు వచ్చారు. ఆంధ్ర యూనివర్సిటీ వందేళ్ల ఉత్సవాలు త్వరలోనే జరగనున్నాయి. ఓ విభాగం నిర్వహించే వజ్రోత్సవాలే ఇలా ఉంటే.. వర్సిటీ వందేళ్ల ఉత్సవాలు ఇంకెలా చేస్తారోనని ఆచార్యులు సైతం పెదవి విరుస్తున్నారు.
ఏయూలో పేలవంగా వజ్రోత్సవాలు
Comments
Please login to add a commentAdd a comment