కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఖూనీ
● కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ
నక్కపల్లి: కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని రాష్ట్ర కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ ఆరోపించారు. మంగళవారం ఆయన పలువురు కార్యకర్తలతో కలసి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఇచ్చిన పిలుపు మేరకు చలో తుని కార్యక్రమానికి వెళ్లారు. తుని మున్సిపల్ కౌన్సిలర్లకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వీసం మాట్లాడుతూ గతంలో జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ప్రజలు ఘోరంగా ఓడించారన్నారు. స్థానిక ఎన్నికల్లో చీత్కరించినప్పటికీ సిగ్గురాలేదన్నారు. నాలుగేళ్ల అనంతరం అధికారం ఉంది కదా అని, తగినంత సంఖ్యాబలం లేకపోయినప్పటికీ కార్పొరేషన్‌లో మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకునేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు. తుని మున్సిపాలిటీలో ఒక్క కౌన్సిలర్ కూడా టీడీపీ నుంచి గెలవలేదన్నారు. ఇప్పుడు అధికారం ఉంది కదా అని, కొంతమంది వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకుని వైస్ చైర్మన్ పదవిని దక్కించుకోవాలని కుట్రలకు తెరలేపిందన్నారు. ప్రజాస్వామ్మాన్ని ఖూనీ చేస్తూ కూటమి ప్రభుత్వం నీతులు చెబుతోందన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహించడం లేదన్నారు. కూటమి ప్రభుత్వానికి దమ్ముంటే వచ్చే ఏడాది జరిగే స్థానిక ఎన్నికల్లో సత్తా చూపి పదవులు దక్కించుకోవాలని హితువు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment