అంతర్జాతీయ ఓపెన్ కరాటే పోటీల్లో బంగారు పతకాలు
● 9వ తరగతి విద్యార్థి రిషిసాయి ప్రతిభ
మునగపాక: కృషి, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని నిరూపించాడు మండలంలోని మెలిపాకకు చెందిన రిషిసాయి. 9వ తరగతి చదువుతున్న రిషిసాయి అంతర్జాతీయ ఓపెన్ కరాటే పోటీల్లో పాల్గొని రెండు బంగారు పతకాలతో పాటు బ్లాక్ బెల్ట్ సాధించాడు. సినీ నటుడు సుమన్ నుంచి మెడల్ అందుకున్నాడు. మండలంలోని మెలిపాకకు చెందిన కొత్తపల్లి ఉమాశంకర్–రాణి దంపతుల కుమారుడు రిషిసాయి విశాఖలోని భావన విద్యా నికేతన్‌లో 9వ తరగతి చదువుకుంటున్నాడు. చదువులో రాణించడంతో పాటు కరాటేలో శిక్షణ పొందుతున్నాడు. విశాఖ స్పోర్ట్స్ స్టేడియంలో ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో పాల్గొని తన ప్రతిభ చాటాడు. రెండు బంగారు పతకాలతో పాటు బ్లాక్ బెల్ట్‌ను సైతం సొంతం చేసుకున్నాడు. కోచ్ ఎస్‌పీఎండీ నాయుడు వద్ద రిషిసాయి కరాటేలో శిక్షణ పొందుతున్నాడు. గ్రామీణ ప్రాంత బాలుడు పతకాలు, బ్లాక్ బెల్ట్ సొంతం చేసుకోవడం పట్ల కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment