అల్లిపురం (విశాఖ): వ్యవస్థీకృత(ఆర్గనైజ్) క్రైం కేసులో ఇద్దరు తైవాన్ వాసులను సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి మంగళవారం మీడియాకు తెలిపిన వివరాలు.. గత ఏడాది అక్టోబర్ 16న ఇల్లీగల్ పేమెంట్ గేట్ వే కేసు విచారణలో భాగంగా తైవాన్ జాతీయులైన ము–చి కోనియన్ సేంగ్ అలియాస్ సంగ్ ము–చి అలియాస్ మార్క్, హా–యున్ చాంగ్ అలియాస్ చాంగ్ హోవో–యున్ అలియాస్ మార్కోలు నగరంలోని రాడిసన్ బ్లూ రిసార్ట్స్, సేన్‌ప్రా బే వ్యూ హోటల్‌లో బసచేసి అమాయకులను ఆకర్షించి, వారికి సైబర్ నేరాల్లో శిక్షణ అందించేవారు. దేశంలోని వివిధ వ్యక్తుల సాయంతో పేద, వ్యసనాలకు బానిసలైన వ్యక్తులకు డబ్బు ఆశ చూపి వివిధ బ్యాంకుల్లో సేవింగ్, కరెంట్ ఖాతాలను తెరిచేవారు. వివిధ రకాల మొబైల్ నెట్‌వర్కులకు సంబంధించిన సిమ్‌కార్డులను తీసుకుని, దేశంలో వివిధ ప్రాంతాలలో మకాం వేసి రూ.కోట్ల లావాదేవీలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి, డీసీపీ అజిత వేజెండ్ల సహకారంతో మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇప్పటి వరకు ఇద్దరు విదేశీ నిందితులు, ఒక అంతర్ జిల్లా ముద్దాయితోపాటు 26 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు సీపీ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment