సమర్థంగా ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ
● పీవోలు, ఏపీవోలు పారదర్శకంగా ఉండాలి ● నిబంధనలను కచ్చితంగా పాటించాలి ● తొలి విడత శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ కృష్ణన్
తుమ్మపాల: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. ఈనెల 27న జరగనున్న పోలింగ్ ప్రక్రియపై ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు తొలి విడత శిక్షణ తరగతులను మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పీవోలు, ఏపీవోలు పూర్తి పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్ నిర్వహించాలన్నారు. పోలింగ్ ప్రక్రియలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. సాధారణ ఎన్నికలకు భిన్నంగా బ్యాలెట్ పద్ధతిన జరిగే ఎమ్మెల్సీ పోలింగ్ నిర్వహణలో వ్యవధి ఎక్కువగా పట్టే అవకాశం ఉన్నందున ఓపిగ్గా, సంయమనం పాటిస్తూ సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలన్నారు. చిన్నపాటి తప్పిదానికి కూడా తావు లేకుండా పోలింగ్ ప్రక్రియ జరిగేలా విధులు నిర్వర్తించాలన్నారు. పోలింగ్ ప్రక్రియ బాధ్యత మొత్తం ప్రిసైడింగ్ అధికారిదేనని, బ్యాలెట్ బాక్సులు తీసుకున్న రోజు నుంచి పోలింగ్ ముగిసి తిరిగి అప్పగించే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నియమావళి ప్రకారంగా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పక్కాగా విధులు నిర్వహించాలన్నారు. ఓటు వేయడానికి ఎన్నికల కమిషన్ అందజేసిన పెన్ను మాత్రమే వినియోగించాలన్నారు.
జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు, ట్రైనింగ్ ప్రోగ్రాం అధికారులు డీపీఆర్సీ జిల్లా కోఆర్డినేటర్ నాగలక్ష్మి, సివిల్ సప్‌లైస్ జిల్లా మేనేజర్ పి.జయంతి ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఎన్నికల సెక్షన్ సూపరింటెండెంట్ ఎస్.వి.ఎస్.ఎస్.నాయుడు, డిప్యూటీ తహసీల్దార్ పి.అరుణచంద్ర ఎన్నికల నిబంధనలు, పోలింగ్ విధానం, బ్యాలెట్ బాక్సుల నిర్వహణపై శిక్షణ అందించారు.
Comments
Please login to add a commentAdd a comment