పరిశ్రమలకు భూములిచ్చేది లేదు...!
రాంబిల్లి (యలమంచిలి) : పరిశ్రమలకు భూములు ఇచ్చే ప్రసక్తే లేదని గొరపూడి పంచాయతీ ప్రజలు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్.డి.అనితకు ఏపీఐఐసీ జెడ్‌ఎం నరసింహారావుకు ముక్తకంఠంతో తేల్చిచెప్పారు. రాంబిల్లి మండలం గొరపూడి పంచాయితీ శివారు గ్రామం అప్పన్నపాలెం కాలనీలో రైతు సేవా కేంద్రం వద్ద బుధవారం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనిత, ఏపీఐఐసీ జెడ్‌ఎం నరసింహారావు, స్ధానిక రెవెన్యూ, పోలీసులు అధికారుల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పరిశ్రమల కోసం భూసేకరణ అంశంపై గ్రామంలో రైతులు, ప్రజలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గతంలో పరిశ్రమల కోసం భూములు తీసుకోవడం పై స్థానిక ప్రజలు నష్ట పరిహారంపై హైకోర్టుకు వెళ్లడంతో కోర్టు రైతులకు కొత్త భూసేకరణ చట్టం ద్వారా భూపరిహారం అందించాలని ప్రభుత్వానికి సూచించిందని, ఈమేరకు ప్రభుత్వ అదేశాలు మేరకు గ్రామంలో రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి రైతుల నుంచి అభిప్రాయ సేకరణకు ఈ సమావేశం నిర్వహించడం జరిగిందని ఎస్‌డీసీ రైతులకు తెలిపారు. భూసేకరణపై రైతులు తమ అభిప్రాయాలు తెలపాలని కోరగా రైతులు మాట్లాడుతూ రాంబిల్లి మండలంలోకి ఇప్పటికే పరిశ్రమల రాకతో భూములు కోల్పోయి, ఉపాధి కరువై ఆర్థిక ఇబ్బందులో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయని, అలాగే గ్రామంలో భూములకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం చాలా తక్కువ అని ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం గొరపూడి పంచాయతీలో అధికంగా భూములకు ధరలు పలుకుతున్నాయని, ఎకరాకు ప్రభుత్వం చాలా తక్కువగా రూ. 20 లక్షలు ఇవ్వడం అన్యాయమని అన్నారు. గతంలో వచ్చిన పరిశ్రమల మా భూములు కొన్ని పొగొట్టుకున్నామని, భూములు తీసుకుని ఆ కంపెనీల్లో స్థానికులకు లేబర్ ఉద్యోగాలు తప్ప సరైన ఉద్యోగాలు ఇవ్వక చిన్న చూపు చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయమై ఎన్నికల్లో నేతల దృష్టికి సమస్యను తీసుకెళ్లామని, ఎన్నికలయ్యాక ఎమ్మెల్యే, ఎంపీ కూడా పట్టించుకోవడం లేదని అన్నారు.
మ్యూటేషన్ల పేరిట ముప్పుతిప్పలు..
గొరపూడి గ్రామ పంచాయతీలో రీ సర్వేలో తప్పులు దొర్లుతున్నాయి అని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనిత దృష్టికి రైతులు తీసుకువెళ్లారు. గొరపూడి గ్రామంలో భూమి యజమానుల పేర్లు కాకుండా పక్క ఊరి రైతుల పేర్లను రెవెన్యూ అధికారులు వెబ్‌ల్యాండ్‌లో తప్పుగా నమోదు చేశారని, దానివల్ల రైతు భరోసా పథకం రాకుండా భూమి ద్వారా ఎటువంటి రుణాలు తెచ్చుకోవడానికి వీలు పడక చాలా ఇబ్బందులు పడుతున్నామని ఈ సమస్యలపై రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళితే మ్యూటేషన్‌ల పేరిట అధిక మొత్తంలో రైతుల నుంచి డబ్బులు కట్టమని అడుగుతున్నారని డబ్బులు కడితేనే మారుస్తారంటా...! మరి అలాంటప్పుడు రెవెన్యూ సదస్సులు ఎందుకు నిర్వహిస్తున్నారని రైతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రెవెన్యూ అధికారులతో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మాట్లాడుతూ రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని వారికి సూచించారు.
భూములు కోల్పోయిన రైతులకు సరైన పరిహారం ఇవ్వరు
పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇవ్వరు, ఉపాధి చూపరు
బలవంతంగా లాక్కుందాం అంటే లాక్కోండి
తేల్చి చెప్పిన అప్పన్నపాలెం గ్రామస్తులు
ఏపీఐఐసీ భూ నిర్వాసితులతో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనిత,
ఏపీఐఐసీ జెడ్‌ఎం నరసింహారావు సమావేశం
సమస్యలు ఏకరువు పెట్టిన రైతులు
పరిశ్రమలకు భూములిచ్చేది లేదు...!
Comments
Please login to add a commentAdd a comment