పాఠశాల ప్రహరీ నిర్మాణంలో.. టీడీపీ నేతల మధ్య రగడ
● రూ.11 లక్షల నిధులు మంజూరు ● రెండు రోజుల క్రితం పనులు ప్రారంభించిన తెనుగుపూడి టీడీపీ నేత ● అడ్డగించిన విస్సారపుదొడ్డి టీడీపీ నేతలు ● హెరిటేజ్ పాల కేంద్రం కోసమే అడ్డగించారని ఆరోపణలు
దేవరాపల్లి: మండలంలోని తెనుగుపూడి పంచాయతీ శివారు విస్సారపు దొడ్డి ప్రాథమిక పాఠశాల ప్రహరీ నిర్మాణంలో టీడీపీ నేతల మధ్య వివాదం నెలకొంది. స్థానిక పాఠశాల ప్రహరీ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు రూ. 11 లక్షలు మంజూరయ్యాయి. పనులు చేపట్టేందుకు తెనుగుపూడి పంచాయతీ పాలకవర్గం సైతం అంగీకారం తెలుపుతూ తీర్మానం చేసింది. ఈ నిధులతో తెనుగుపూడికి చెందిన టీడీపీ మాజీ ఎంపీటీసీ సభ్యుడు పెంటకోట అప్పలనాయుడు రెండు రోజుల క్రితం ప్రహరీ నిర్మాణానికి గుంతలు తవ్వగా స్థానిక టీడీపీ నేతలు కొందరు పనులను అడ్డగించారు. ప్రహరీ నిర్మిస్తే పాఠశాల ఆవరణలో శుభ కార్యాల నిర్వహణకు ఆటంకం ఏర్పడుతుందని, ఎట్టి పరిస్థితుల్లో నిర్మించడానికి వీల్లేదని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం పాఠశాలకు విద్యార్థులు హాజరు కాకుండా చేశారు. దీంతో ఆరుగురు విద్యార్థులకు గాను ఒక్క విద్యార్థి మాత్రమే పాఠశాలకు హాజరయ్యాడు. అయితే దేవాలయం లాంటి పాఠశాలను రాజకీయాలకు కేంద్రంగా మార్చిన టీడీపీ నేతల తీరు పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. పాఠశాలకు ప్రహరీ నిర్మించడం ద్వారా విద్యార్థులకు రక్షణ ఏర్పడుతుంది తప్ప దీని వల్ల గ్రామస్తులకు ఎటువంటి ఆటంకం ఏర్పడే పరిస్థితి ఉండదు. పాఠశాల ఆవరణలో ఉన్న కమ్యూనిటీ హాల్లో హెరిటేజ్ పాల సమీకరణ కేంద్రం నిర్వహిస్తుండటంతో ప్రహరీ నిర్మిస్తే లోపలికి వెళ్లేందుకు ఇబ్బందులు తలెత్తుతాయని స్థానిక టీడీపీ నేతలు అడ్డగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా ఇరు వర్గాల టీడీపీ నేతలు స్వార్థ రాజకీయాలను పక్కన పెట్టి ఏకాభిప్రాయంతో ప్రహరీ నిర్మాణం పూర్తయ్యేలా చొరవ చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా ప్రహరీ నిర్మాణంపై నెలకొన్న సమస్యను పరిష్కరించాల్సిన విద్యాశాఖ అధికారులు చోద్యం చూడటం శోచనీయమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment