సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం
అనకాపల్లి: కేంద్ర పథకాల ద్వారా ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ అమలు చేయబోమని ఇటీవల రాష్ట ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 2ను తక్షణమే రద్దు చేయాలని, ఆప్కోస్‌ను రద్దు చేసి జిల్లాల ఏజెన్సీలకు ఉద్యోగులను కట్టబెట్టాలనే క్యాబినెట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ కాంట్రాక్ట్ అండ్ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఏవీ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న 3 లక్షల కాంట్రాక్ట్ అండ్ ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, ఆప్కోస్ ఉద్యోగుల పట్ల దుర్మార్గ వైఖరి ప్రదర్శిస్తూ వారిని అభద్రతాభావంలోకి నెట్టటం ఎంత వరకూ సమంజమని ప్రశ్నించారు. ఉద్యమాల ద్వారా ఈ ప్రభుత్వ నిర్ణయాలను తిప్పికొట్టాలన్నారు. గతంలో సమగ్ర శిక్ష, మున్సిపల్, అంగన్‌వాడీ తదితర సమ్మెల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మినిట్స్‌ను అమలు చేయాలన్నారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగులందరికీ మినిమం టైమ్‌స్కేల్ అమలు చేయడం, హెచ్‌ఆర్‌ఏ, డీఏ, గ్రాట్యుటీ క్రమబద్ధీకరణ వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. దీనిపై మార్చి 10న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సమగ్ర శిక్ష జేఏసీ నాయకుడు బి.కాంతారావు మాట్లాడుతూ 15 సంవత్సరాల నుంచి విద్యాశాఖలో పని చేస్తున్న ఎస్‌ఎస్‌ఏ, కేజీబీవీ ఉద్యోగులు, వైద్య, ఆరోగ్యం, ఇతర శాఖల్లో పని చేస్తున్న వారిని మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ జేఏసీ నాయకులు అచ్యుత కృష్ణ, బ్రహ్మాజీ, నూకేష్, రామకృష్ణ, పెంటయ్య, సాయి, నర్సింగరావు, నందేశ్వరరావు, లక్ష్మి, కమల, వి.వి.శ్రీనివాసరావు, దేవకి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment