4న రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్ల నిరసన
చోడవరం బస్‌స్టాప్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న ఆటో డ్రైవర్లు
అనకాపల్లి టౌన్ : కూటమి ప్రభుత్వం గత ఎన్నికలలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, లేని పక్షంలో మార్చి 4న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్, వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వామనమూర్తి హెచ్చరించారు. స్ధానిక చోవవరం బస్‌స్టాప్ వద్ధ సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికలలో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, ఆటో డ్రైవర్ల పిల్లలకు స్కాలర్‌షిప్ మంజూరు చేస్తామని, చంద్రన్న బీమాపాలసీ 5 నుంచి రూ.10 లక్షల వరకు అమలు చేస్తామని, టాటా మ్యాజిక్ వ్యాన్‌లు, కార్లు, జీపులకు రోడ్ టాక్స్, గ్రీన్ టాక్స్, లేబర్ టాక్స్ తగ్గిస్తామని అధికారంలోకి వచ్చి 8 నెలలు అయినా ఒక్క హామీ కూడా ఈ రోజు వరకు అమలు చేయలేదన్నారు. ఈ నెలలో జరిగే శాసన సభ సమావేశాల్లో ఈ హామీలు అమలు చేసే జీవోలను విడుదల చేయాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కోన లక్షణ మాట్లాడుతూ జీవో 21,31 లను తక్షణమే రద్దు చేయాలని, స్థానికంగా ఆటోలకు పార్కింగ్ స్థలాలు కేటాయించాలని, ఆటో ఎఫ్‌సిలు ప్రెవేట్ వ్యక్తులకు ఇచ్చే ఆలోచనలు విరమించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పెదిరెడ్డ నాగేశ్వరావు, కరణం చిరంజీవి, మడిశ శ్రీను, మల్లిబాబు, తాతారావు, డొంక సింహాచలం నాయుడు, పెంటారావు, కృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment