ఆ తారురోడ్డు నిర్మాణం.. వైఎస్సార్‌సీపీ పుణ్యమే
● వి.బి.పేట సర్పంచ్ నర్సింహమూర్తి
రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభిస్తున్న నాటి డిప్యూటీ సీఎం బూడి (ఫైల్)
చీడికాడ: మండలంలోని శివారు వి.బి.పేట పంచాయతీలోని వి.బి.పేట నుంచి శివారు కొండేంపూడి, గొప్పూరు తారురోడ్డు నిర్మాణం వైఎస్సార్‌సీపీ పుణ్యమని, మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు చొరవ అని వి.బి.పేట సర్పంచ్ వంటాకు నర్సింహమూర్తి అన్నారు. ఆయన బుధవారం మాట్లాడుతూ ఒక ప్రముఖ పత్రికలో వి.బి.పేట నుంచి కొండేంపూడి, గొప్పూరు తారురోడ్డు ప్రస్తుత ఎమ్మెల్యే చొరవతో పూర్తి కావస్తుందంటూ తప్పుడు సమాచారం ప్రచురించారన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యేకు తమ ఊరు ఎక్కడుందో ఇప్పటి వరకు తెలియదన్నారు. వి.బి.పేట ప్రజలతో పాటు కొండేంపూడి, గొప్పూరు, జైపురం, ముడిచర్లకు చెందిన గిరిజనులు తారురోడ్డు నిర్మించాలని కోరడంతో సార్వత్రిక ఎన్నికల ముందు రూ. 5.60 కోట్ల నాబార్డు నిధులతో ఈ రోడ్డు నిర్మాణానికి అప్పటి ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు శంకుస్థాపన చేసి ఆ రోజు నుంచే పనులు ప్రారంభించారన్నారు. నాటి నుంచి నేటి వరకు ఆ పనులు నిరాటంకంగా కొనసాగుతూ నేడు చివరి దశకు చేరుకున్నాయన్నారు. మరో వారం, పది రోజుల్లో తారుపోత పూర్తి అయి రోడ్డు ప్రారంభానికి సిద్ధం అవుతున్న నేపథ్యంలో గత ప్రభుత్వం చేసిన మంచిని తమ ఖాతాలో వేసుకునేందుకు చూడడం తగదన్నారు. ఆ దినపత్రికలో వచ్చిన వార్తను ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించడం తగదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment