సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి
కె.కోటపాడు: సైబర్ నేరాలు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. ఎ.కోడూరు, కె.కోటపాడు పోలీస్‌స్టేషన్లను బుధవారం సాయంత్రం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రెండు పోలీస్‌స్టేషన్ల రికార్డులు పరిశీలించారు. పెండింగ్ కేసుల సీడీ ఫైళ్లను పరిశీలించి, వాటి పురోగతిపై అధికారులకు సూచనలను చేశారు. గంజాయి అక్రమ రవాణాను నియంత్రించేందుకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంతో పాటు గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు నిరోధించేందుకు పోలీస్ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని తెలిపారు. ద్విచక్ర వాహన చోదకులు హెల్మట్ ధరించాలని, ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన వారిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసులు నమోదు చేయాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. రౌడీ షీటర్లు, చెడు నడత కలిగిన వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని వివరించారు. దొంగతనాలు, ఇతర నేరాలను అరికట్టేందుకు రాత్రి గస్తీలను పోలీసులు మరింత పటిష్టంగా నిర్వహించాలని సూచించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో సిబ్బందితో మాట్లాడారు. కార్యక్రమంలో కె.కోటపాడు సీఐ పైడపునాయుడు, ఎ.కోడూరు, కె.కోటపాడు పోలీస్‌స్టేషన్ల ఎస్‌ఐలు డి.లక్ష్మీనారాయణ, ఆర్.ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment