● ఘనంగా అంకురార్పణ ● మాడవీధుల్లో పెళ్లి కావిడి ఊరేగింపు ● స్వర్ణాభరణాలతో దర్శనమిస్తున్న స్వామివారు ● విద్యుద్దీపకాంతులతో మెరుస్తున్న ఆలయం
నక్కపల్లి: ఉత్తరాంధ్ర ప్రాచీన పుణ్యక్షేత్రం ఉపమాక గరుడాద్రి పర్వతంపై వెంకన్న వార్షిక తిరుకల్యాణోత్సవాలకు ఆదివారం సాయంత్రం అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, పరిషత్, కంకణ ధారణ అంతరాలయ దేవతాపూజ, మత్స్యంగ్రహణ నిర్వహించారు. నిత్య సేవాకాలంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థ గోష్టి ప్రసాద వినియోగం జరిపారు. అంకురార్పణ పూజా కార్యక్రమాల్లో భాగంగా హంసవాహనంపై తిరువీధి సేవ నిర్వహించారు. స్వామివారి కల్యాణ మండపంలో ఉభయదేవేరులను ఉంచి సుదర్శన పెరుమాళ్లను పల్లకిలో ఉంచి పుట్టమన్ను తెచ్చేందుకు తీసుకెళ్లారు. దీన్నే అంకురార్పణ అంటారు. అనంతరం వాస్తు మండప పూజ, యోగీశ్వరపూజ, అగ్నిప్రతిష్టాపన, జయాది హోమాలు జరిగాయి. గరుడ ప్రాణప్రతిష్ట విశేషహోమాలు, నీరాజన మంత్ర పుష్ప కార్యక్రమం నిర్వహించి గరుడప్పాలు నివేదన చేశారు. అష్టదిక్పాలకులకు ఆవాహన కార్యక్రమాలు నిర్వహించి, స్వామివారి పెళ్లికావిడిని ఉపమాక మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారికి పసుపు కుంకుమలు, కొబ్బరిబొండాలు కానుకలుగా సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమాలతో స్వామివారి కల్యాణోత్సవాలు లాంఛనంగా ప్రారంభమయ్యా యని ఆలయప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాద్ తెలిపారు. పెళ్లికావిడి ఊరేగింపులో అర్చకులు కృష్ణమాచార్యులు, గోపాలాచార్యులు, శేషాచార్యులు, రాజగోపాలాచార్యులు, సాయి ఆచార్యులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.
నేడే స్వామివారి కల్యాణం
స్వామివారి కల్యాణం సోమవారం అర్ధరాత్రి అంగరంగ వైభవంగా జరగనుంది. అదేరోజు సాయంత్రం కన్యావాద సంవాదం (ఉపమాక సింహద్రాచార్యులు ఇంటి వద్ద స్వామివారి అమ్మవార్ల పెండ్లిమాటలు, గుణగణాలను వివరించే తంతును నిర్వహిస్తారు) తరిగొండ వేంగమాంబ సాహితీ పీఠం వ్యవస్థాపకురాలు, వేద పండితురాలు డాక్టర్ గొట్టుముక్కల గాయత్రీదేవి వ్యాఖ్యాతగా వ్యవహరించి కన్నుల పండువగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనంతరం రథోత్సవం జరుగుతుంది. తదుపరి స్వామివారి కల్యాణం నిర్వహించేందుకు దేవస్థానం వారు ఏర్పాట్లు చేశారు. 12వ తేదీ పండిత సభ, 13వ తేదీన స్వామివారికి గజవాహనంపై తిరువీధి సేవ,14న పౌర్ణమినాడు రాజయ్యపేట సముద్రతీరంలో స్వామివారికి చక్రస్నానం నిర్వహిస్తారు. రాత్రికి డోలోత్సవం, అద్దపు సేవ జరుగుతుంది. 15 నుంచి 17 వరకు స్వామి వారి పుష్పయాగోత్సవాలు జరుగుతాయి. కల్యాణ తంతును నిర్వహించేందుకు తిరుచానూరు పద్మా వతి ఆలయానికి చెందిన ప్రముఖ వేదపండితులు, ఆగమశాస్త్రసలహాదారులను రప్పిస్తున్నారు.
విస్తృత ఏర్పాట్లు
కల్యాణోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంతోపాటు, గోపురాలు, బేడామండపం, ఆస్థాన మండపం, కల్యాణమండపాలకు రంగురంగుల విద్యుద్దీపాలను అలంకరించారు. టీటీడీ సిబ్బంది, పోలీసు సిబ్బంది సుమారు 300 మంది విధుల్లో పాల్గొంటున్నారు. భక్తుల కోసం ప్రత్యేక స్నానఘట్టాలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు.
స్వర్ణాభరణాలతో దర్శనమివ్వనున్న స్వామివారు
వజ్ర వైఢూర్యాలు, కెంపులు, పచ్చల హారం, కాసులపేర్లు, మరకత మాణిక్యాలు, బంగారంతో తయారు చేసిన శంఖు, చక్రం, హస్తాలు, వజ్రాలు పొదిగిన కిరీటాలు, హారాలు, చంద్రహారాలు, స్వర్ణ వజ్రకవచం ఇలా స్వామివారికి వెలకట్టలేనన్ని ఆభరణాలున్నాయి. వీటిని స్వామివారికి అలంకరించి ఐదురోజుల పాటు భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment