కార్మికుల భద్రతతోనే స్వర్ణాంధ్ర సాకారం
● రాష్ట్ర కార్మిక, కర్మాగార బాయిలర్, వైద్య బీమా సర్వీసుల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ● జాతీయ భద్రతా వారోత్సవాల ప్రారంభం
అనకాపల్లి: జాతీయ భద్రత వారోత్సవాలను పురస్కరించుకుని కార్మికులతో పాటు సామాన్య ప్రజలకు భద్రత పట్ల అవగాహన కల్పించాలని రాష్ట్ర కార్మిక, కర్మాగార బాయిలర్, వైద్య బీమా సర్వీసుల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. 54వ జాతీయ భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని స్థానిక ఎన్టీఆర్ క్రీడామైదానంలో కలెక్టర్ విజయకృష్ణన్, యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌లతో కలసి ఆయన ఆదివారం జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కార్మికుల భద్రంగా ఉంటేనే రాష్ట్రం భద్రంగా ఉంటుందని, కార్మికుల భద్రతతోనే స్వర్ణాంధ్రప్రదేశ్ కల సాకారం అవుతుందన్నారు. కార్మికుల భద్రతకు ప్రభుత్వమే కాకుండా యాజమాన్యం కూడా బాధ్యత వహించి వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పించాలని అన్నారు. జిల్లాలో 884 పరిశ్రమలు ఉన్నాయని, వాటిలో 205 ప్రమాదకరమైన కార్యకలాపాలు నిర్వహించే పరిశ్రమలు ఉన్నాయని, ఈ పరిశ్రమలన్నింటిలో సుమారుగా లక్షా 28వేల మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్మికులతో పాటు విద్యార్థులందరికీ భద్రత పట్ల అవగాహన కల్పించాలని కోరారు. సేఫ్టీ అండ్ వెల్‌బీయింగ్ కృషియల్ ఫర్ వికసిత్ భారత్–2047 అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన చర్యల గురించి సలహాలు ఇవ్వడానికి వసుధ మిశ్రా నేతృత్వంలో ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఎస్పీ తుహిన్‌సిన్హా మాట్లాడుతూ పరిశ్రమలలో ప్రమాదాలపై కార్మికులకు మాక్ డ్రిల్ నిర్వహించి భద్రతపై శిక్షణ ఇవ్వాలన్నారు. యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ మాట్లాడుతూ యాజమాన్యం, కార్మికుల సంయుక్త కృషితో జీరో యాక్సిడెంట్ లక్ష్యంగా కృషి చేయాలన్నారు. ప్రతి కార్మికునికి బీమా సహాయం అందాలంటే ఆయా పథకాలలో నమోదు కావాలని ఆయన కోరారు. అనంతరం ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు, మెమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్మికశాఖ డైరెక్టర్ చంద్రశేఖర్‌మూర్తి, కర్మాగార సంయుక్త ముఖ్య తనిఖీ అధికారి జె.శివశంకర్‌రెడ్డి, జిల్లా పరిశ్రమల కేంద్ర జీఎం నాగరాజారావు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ ముకుందరావు, ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, నేవీ, ఫైర్ సర్వీసస్, హెచ్‌పీసీఎల్, ఎన్‌టీపీసీ, హెటిరో ఫార్మా కంపెనీ యాజమాన్యం, పట్టణ సీఐ టి.వి.విజయ్‌కుమార్, ట్రాఫిక్ సీఐ ఎం.వెంకటనారాయణ పాల్గొన్నారు.
కార్మికుల భద్రతతోనే స్వర్ణాంధ్ర సాకారం
Comments
Please login to add a commentAdd a comment