సాధారణ భక్తులకు గంటలోపు దర్శనం
● నూకాంబిక అమ్మవారి జాతర రాష్ట్ర పండగ ● పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశం
తుమ్మపాల: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు నూకాంబిక అమ్మవారి జాతరను ఈ ఏడాది రాష్ట్ర పండుగగా ప్రకటించినందున, అందుకు తగినట్లుగా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ దేవదాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 27 వరకు జరగనున్న అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాల ఏర్పాట్లపై శుక్రవారం కలెక్టరేట్‌లో దేవదాయ శాఖ, పోలీసు, జీవీఎంసీ, ఎలక్ట్రికల్, ఎక్సైజ్, ఆర్‌టీసీ, తదితర శాఖల అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పండగ నిర్వహణలో ప్రొటోకాల్ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇచ్చి, గంటలోపు దర్శనం కల్పించే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రతి శాఖ అధికారులు ముందుగానే ప్రణాళికతో పండగ నిర్వహణకు సిద్ధం కావాలన్నారు. గత సంవత్సరాల అనుభవాలతో సాధారణ రోజులు, ఆదివారం రోజుల్లో ఎంత మంది భక్తులు వస్తారో అంచనా వేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. భక్తులకు ఎండ తగులకుండా పందిర్లు, మంచినీరు అందుబాటులో ఉంచాలని చెప్పారు. శానిటేషన్ సక్రమంగా చేపట్టాలని, అదనపు మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ పండగ జరిగినన్ని రోజులు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. చిన్నారులకు పాలిచ్చేందుకు ప్రత్యేక గది ఏర్పాటు చేయాలన్నారు. పార్కింగ్ నిర్వహణ పక్కాగా ఉండాలన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా, సురక్షితమైన ఏర్పాట్లు చేయాలన్నారు. అమ్మవారి ఆలయ సమీపంలో మద్యం అమ్మకాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు, డీఎస్‌పీ ఎం.శ్రావణి, పండగ నిర్వహణ ప్రత్యేకాధికారి కె.శోభారాణి, ఆలయ నిర్వహణాధికారి బి.రాంబాబు, జిల్లా వైద్య ఆరోగ్యఅధికారి డా. పి.రవికుమార్, జిల్లా అగ్నిమాపక, విపత్తుల నివారణ అధికారి ఆర్.వి.రమణ, జీవీఎంసీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు ఎస్.శేఖర్, జిల్లా సహాయ ఇంజినీరు ఎ.వి.వి.శివప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment