పరీక్ష కేంద్రం వద్ద బైక్‌పై మైనర్ విద్యార్థి హల్‌చల్
● నలుగురు విద్యార్థినులు, ఒక టీచర్‌కు గాయాలు ● గాయాలతోనే పరీక్ష రాసిన విద్యార్థినులు ● మైనర్ విద్యార్థిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
చోడవరం : ఒక మైనర్ విద్యార్థి మోటారుసైకిల్‌తో చేసిన హల్‌చల్ నలుగురు విద్యార్థులను, ఒక టీచర్‌ను గాయాల పాల్జేసింది. గోవాడ హైస్కూల్‌లో పరీక్ష కేంద్రం వద్ద సోమవారం ఈ సంఘటన జరిగింది. మండలంలో గోవాడ జిల్లా పరిషత్ హైస్కూల్లో పదోతరగతి గణితం పరీక్ష రాసేందుకు నర్సాపురం కస్తూర్బా పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులను తీసుకొని టీచర్ పరీక్ష కేంద్రానికి వచ్చారు. పరీక్ష కేంద్రంలోకి ఇంకా అనుమతించడానికి కొంత సమయం ఉండడంతో అంతా బయట నిలుచొని ఉన్నారు. ఇంతో దూరవిద్య ద్వారా పదో తరగతి పరీక్ష రాసేందుకు ఇదే పరీక్ష కేంద్రానికి చోడవరానికి చెందిన ఒక విద్యార్థి మోటారు సైకిల్‌పై వచ్చాడు. రోడ్డుపై మోటారు సైకిల్‌తో వేగంగా అటూ ఇటూ తీరుగుతూ హల్‌చల్ చేస్తుండగా ఒక్కసారిగా మోటారు సైకిల్ అదుపు తప్పింది. ఆ పక్కనే ఉన్న కస్తూర్బా పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థినులు, వారితో ఉన్న మహిళా టీచర్‌ను మోటారు సైకిల్‌తో ఢీకొట్టాడు. ఈ ఘటనలో వారంతా గాయపడడంతో భయాందోళనతో అక్కడ ఉన్న తోటి విద్యార్థులు పరుగు తీశారు. గాయపడిన విద్యార్థినులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. పరీక్ష సమయం అవుతుండడంతో వెంటనే వారిని పరీక్ష కేంద్రానికి తీసుకొచ్చారు. గాయాలతోనే ఆ విద్యార్థినులు ఎంతో బాధతో పరీక్ష రాశారు.
బాధిత విద్యార్థినులను మండల విద్యాశాఖాధికారి సింహాచలం పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. ఇదిలావుండగా ఈ ప్రమాదానికి కారణమైన మైనర్ విద్యార్థిని చోడవరం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. విద్యార్థుల భవిష్యత్ రీత్యా తదుపరి చర్యలపై అధికారులు సమీక్షిస్తున్నట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment