
తాండవ గేట్లకు మరమ్మతులు
తాండవ ఎడమ కాలువ నీరు కోటనందూరు మండలం వెళ్లే డ్రాప్ దగ్గర గేట్ల మరమ్మతులు
నాతవరం : తాండవ రిజర్వాయరు ప్రధాన గేట్లు మరమ్మతులతో పాటు పిల్ల కాలువల గేట్లు మరమ్మతు పనులు చేపడుతున్నామని ప్రాజెక్టు జేఈ ప్రేమ్‌కుమార్ అన్నారు. ఆయన సోమవారం మెకానికల్ జేఈ ఉమాశ్రీతో కలిసి గేట్ల మరమ్మతు పనులకు సంబంధించి మెటీరియల్ క్రేన్ ఏర్పాటును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జేఈ మాట్లాడుతూ తాండవ ప్రధాన గేట్ల లీకేజీ కారణంగా ప్రాజెక్టులో నీరంతా వృఽథాగా బయటకు పోయేదన్నారు. ప్రధాన గేట్లు 2, 19 కిలోమీటర్ల వద్ద గేటు మరమ్మతులకు ప్రభుత్వం రూ.19.70 లక్షలు మంజూరు చేసిందన్నారు. కొంతవరకు మరమ్మతులు చేపట్టడంతో లీకేజీ కొంత అరికట్టగలిగామన్నారు. పూర్తి స్థాయిలో ప్రాజెక్టు ప్రధాన గేట్ల మరమ్మతులు చేసేందుకు మెటీరియల్ రావలసి ఉందన్నారు. ప్రధాన గేట్ల మరమ్మతులు మెకానికల్ డీఈ, జేఈ ఆధ్వర్యంలోనూ, తాండవ ప్రధాన కాలువలు అభివృద్ధి పనులు, పూడికతీత పనులు తాండవ ప్రాజెక్టు డీఈ ఆనురాధ పర్యవేక్షణలో చేపడుతున్నామని వివరించారు.