
ప్రభుత్వ భూమి కబ్జా
ఆర్ భీమవరంలో 110 ఎకరాల
● అనకాపల్లికి చెందిన వ్యాపారి, టీడీపీ నాయకుడి చేతుల్లో కబ్జా స్థలం
● గ్రామదేవత పడమటమ్మ ఆలయ భూమి ఆక్రమణ
● పట్టించుకోని అధికారులు
● గ్రామస్తుల ఆగ్రహం
బుచ్చెయ్యపేట :
మండలంలోని ఆర్.భీమవరం గ్రామంలో సుమారు 110 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. ఈ గ్రామానికి దగ్గరలో ఉన్న అనకాపల్లికి చెందిన వ్యాపారులు, గ్రామ నాయకుడు కలిసి ప్రభుత్వ భూమిని ఆక్రమించారు. సుమారు రూ.25 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనా అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు దారి తీస్తోంది. ఆక్రమణకు గురైన భూముల్లో గ్రామదేవత పడమటమ్మ ఆలయానికి చెందిన భూములు కూడా ఉన్నాయి. ఆక్రమణదారులపై గ్రామస్తులు ఎదురుతిరిగినా రెవిన్యూ, పోలీసు అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు చోద్యం చూడడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామదేవత పడమటమ్మకు చెందిన 10 భూములతో పాటు కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను అధికారులు కాపాడకపోతే టెంట్ వేసి ధర్నాకు దిగడానికి గ్రామస్తులు సన్నద్ధమౌవుతున్నారు. వివరాలివి. ఆర్.భీమవరం గ్రామ శివారులో సర్వే నంబర్ 173లో సుమారు 70 ఎకరాలు, సర్వే నంబర్ 221లో సుమారు 40 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. 173 సర్వే నంబర్‌లో 35 ఏళ్ల కిందట ఇదే గ్రామానికి చెందిన నిరుపేదలు నిట్టా కొండయ్య, మండపాటి దేముడు, వెలంకాయల గంగులుకి డీ పట్టాలు ఇచ్చినట్టు రికార్డుల్లో ఉన్న ఈ భూములు కూడా అనకాపల్లికి చెందిన బడా వ్యాపారుల కబ్జాలో ఉన్నాయి. పూర్వం నుంచి అమ్మవారికి కేటాయించిన భూములను సైతం ఇటీవల గ్రామ నాయకుడు ఆక్రమించి ఫెన్సింగ్ వేసి మొక్కలు నాటి కబ్జా చేయడంపై గ్రామస్తులంతా కలిసి తిరగబడ్డారు. ఫెన్సింగ్‌ను పీకేయడానికి చూడగా ఇరువర్గాల వారికి గొడవలు జరిగాయి. అయినా రెవిన్యూ అధికారులు సర్వే చేసి అమ్మవారి భూములు అప్పగించలేదు. సర్వే నంబర్ 173లో ఉన్న 70 ఎకరాలకు పూర్తి స్థాయిలో సర్వే చేసి పట్టాలిచ్చిన పేదలకు భూములు కేటాయించాలని, అమ్మవారి భూములు కేటాయించి సరిహద్దులు తేల్చాలని, సర్వే నంబర్ 221లో ఉన్న సుమారు 40 ఎకరాల భూమిని పేదలకు పంచాలని రెండు నెలల క్రితం గ్రామ నాయకులు, ప్రజలు కవల సతీష్, రాజారావు, వెలంకాయల అప్పారావు, మండపాక నూకరాజు, శ్రీనివాస్, కాలపురెడ్డి నగేష్ తదితరులు ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్ రాజుకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో సర్వే చేయించి అమ్మవారి భూములను కబ్జా అవనీయకుండా కాపాడతానని ఎమ్మెల్యే మాట ఇచ్చినా నేటికీ అధికారులు సర్వే చేయలేదని, ఆక్రమణలు తొలగించలేదని గ్రామస్తులు ఆగ్రహం చెందుతున్నారు. ఆర్.భీమవరంలో ప్రభుత్వ భూములను, గ్రామదేవత పడమటమ్మ ఆలయ భూములను కాపాడకపోతే తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేయడానికి గ్రామస్తులు సన్నద్ధం అవుతున్నారు.
ఇదే గ్రామంలో మరో భూమాయ
ఇప్పటికే ఇదే గ్రామంలో 30 ఎకరాల ప్రభుత్వ భూమిని జిరాయితీ భూమిగా తప్పుడు సర్వే నంబర్లు వేసి ఒక వ్యాపారికి గ్రామ నాయకుల ద్వారా అమ్మకాలు చేశారు. ఇటీవల రీ సర్వేలో అది ప్రభుత్వ భూమి అని తెలియడంతో వ్యాపారి కడియాల రాజేశ్వరరావు మోసపోయానని తెలుసుకున్నాడు. తాను కొన్న భూమిని తిరిగి ఇచ్చేయాలని గ్రామ నాయకులు ఒత్తడి చేయడంతో విసుగు చెందిన వ్యాపారి ఈ నెల 3వ తేదీన జిల్లా కలెక్టర్ విజయ్‌కృష్ణన్‌ను కలిసి 30 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్టు తన వద్ద ఉన్న భూ రికార్డులను కలెక్టర్‌కు అందజేశారు. జిల్లా అధికారులు ఆర్. భీమవరం రెవిన్యూలో పూర్తి స్థాయిలో భూ సర్వే చేయిస్తే మరిన్ని భూ కబ్జాలు బయటపడతాయని, ప్రభుత్వ భూములను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. దీనిపై తహసీల్దార్ లక్ష్మిని వివరణ కోరగా జిల్లా అధికారులు దృష్టికి తీసికెళ్లి పై అధికారుల ఆదేశాల మేరకు చర్యలు చేపడతామన్నారు.

ప్రభుత్వ భూమి కబ్జా

ప్రభుత్వ భూమి కబ్జా