
నిలకడలేని సేన
● మలేషియాకు చెక్కేసిన జనసేన కార్పొరేటర్లు ● మాట నిలుపుకోని వైనం ● క్యాంప్ రాజకీయాలు చేయబోమని చెప్పిన మంత్రి నాదెండ్ల ● చెప్పిన నాలుగు రోజుల్లోనే విమానంఎక్కిన ఏడుగురు జనసేన కార్పొరేటర్లు ● టీడీపీ కార్పొరేటర్లతో కలిసి ప్రయాణం ● ఆదివారం మరికొంత మంది పయనం
విశాఖ సిటీ: యథారాజా తథా ప్రజా అన్న నానుడి జనసేన నేతలకు సరిగ్గా సరిపోతుంది. నిలకడలేని మాటలు, రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ఏ జిల్లాకు వెళితే ఆ జిల్లాలోనే పుట్టానని.. ఒక్కో సభలో ఒక్కో చదువు చదివానని చెప్పిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో మీమర్లకు ఫుల్‌మీల్స్‌గా మారితే.. ఆ పార్టీ నంబర్–2 నాలుక కూడా నాలుగు రోజుల్లో మడతపెట్టేశారు. విశాఖ మేయర్‌పై అవిశ్వాస ఓటింగ్ వ్యవహారంలో జనసేన క్యాంప్ రాజకీయాలు చేయదని చెప్పిన కొన్ని గంటల్లోనే ఆ పార్టీ కార్పొరేటర్లు విమానమెక్కి చెక్కేయడం గమనార్హం. కార్పొరేటర్లు చేజారిపోతారన్న భయంతో టీడీపీ నేతలే దగ్గరుండి మరీ విమాన టికెట్లు తీయించి మలేషియా విమానం ఎక్కించారు.
నిలకడ లేని మాటలు..
జనసేన పార్టీకి ఓ విధానం, నేతల మాటలకు ఓ నిలకడ లేనట్లు మరోసారి రుజువైంది. అధ్యక్షుడి బాటలోనే కార్పొరేటర్లు నడుస్తూ జిల్లాలో మేయర్ పీఠాన్ని టీడీపీ చేతుల్లో పెట్టేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితమే జనసేన కార్పొరేటర్లు విజయవాడలో పవన్ కల్యాణ్‌ను కలిశారు. అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేయాలని హామీ తీసుకున్నారు. తాము క్యాంపు రాజకీయాలు చేయబోమని, తమ కార్పొరేటర్లపై పూర్తి నమ్మకముందని గొప్పలు చెప్పుకొచ్చారు. అది జరిగిన కొద్ది రోజుల్లోనే మంత్రి నాదెండ్ల మనోహర్ విశాఖకు వచ్చి జనసేన కార్పొరేటర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈయన కూడా క్యాంప్ రాజకీయాలకు జనసేన దూరమని పునరుద్ఘాటించారు. చెప్పిన కొద్ది గంటలకే మాట మార్చారు. అందరినీ విదేశాలకు పంపించాలని నిర్ణయించారు.
ఓటమి భయం
జీవీఎంసీ మేయర్ పీఠాన్ని దక్కించుకోడానికి కూటమి నేతలు కుట్ర రాజకీయాలు తెరతీస్తున్నారు. కౌన్సిల్‌లో బలం పెంచుకోడానికి వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లకు ఎర వేస్తున్నారు. లొంగని వారిపై బెదిరింపులకు దిగుతున్నారు. అయినప్పటికీ.. అవిశ్వాసానికి మద్దతుగా 58 కార్పొరేటర్ల మద్దతు ఉందని కూటమి నేతలు జీవీఎంసీ ఇంచార్జ్ కమిషనర్, జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్‌కు నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఈ నెల 19వ తేదీన అవిశ్వాస ఓటింగ్‌కు ప్రత్యేక కౌన్సిల్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కార్పొరేటర్లకు నోటీసులు పంపించారు. ఇదిలా ఉంటే.. కొంత మంది కార్పొరేటర్లు కూటమిలో ఇమడలేక బయటకు వచ్చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీ నేతలు ఇప్పటికే కొంత మంది కార్పొరేటర్లను మలేషియా పంపించారు. జనసేన కార్పొరేటర్లు కూడా మనసు మార్చుకోకముందే విదేశాలకు పంపించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే ఏడుగురు జనసేన కార్పొరేటర్లకు మలేషియా టికెట్ బుక్ చేసి శుక్రవారం సాయంత్రం దగ్గరుండి మరీ విశాఖ ఎయిర్‌పోర్టులో విమానం ఎక్కించారు. ఆదివారం టీడీపీ కార్పొరేటర్లతో కలిపి మిగిలిన జనసేన కార్పొరేటర్లను కూడా మలేషియా పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
బాంబు పేల్చిన కూటమి కార్పొరేటర్
ఒకవైపు అవిశ్వాస ఓటింగ్‌కు కార్పొరేటర్లు చేజారి పోకూడదని కూటమి నేతలు క్యాంప్ రాజకీయాలు చేస్తుంటే.. మరోవైపు అదే కూటమికి చెందిన 22వ వార్డు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ బాంబు పేల్చారు. మేయర్ గొలగాని హరివెంకటకుమారిపై అవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నట్లు 58 మంది సంతకాలు చేసినట్లు కలెక్టర్ నోటీసులో పేర్కొని, ఆ తీర్మానం కాపీని సభ్యులకు అందించలేదన్న విషయాన్ని ప్రస్తావించారు. కలెక్టర్ కార్పొరేటర్లకు ఇచ్చిన ఫారం–2 నోటీసులో 58 మంది సభ్యులు సంతకం చేసిన ప్రతిపాదిత అవిశ్వాస తీర్మానం కాపీని జత చేసినట్లు చెప్పారని, కానీ అటువంటి మోషన్ కాపీ జత చేయలేదని అభ్యంతరం తెలిపారు. అవిశ్వాస తీర్మానానికి సంతకం చేసిన 58 మంది సభ్యుల సంతకాల ఆధారాలు సమర్పించని పక్షంలో ఆ నోటీసు 1955 మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ప్రకారం ఎవరైనా ప్రశ్నిస్తే కోర్టు ముందు నిలబడకపోవచ్చన్న విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలో పేర్కొన్న విధానాన్ని అనుసరించి పునఃపరిశీలించాలని కోరారు. అవిశ్వాస ఓటింగ్ ప్రక్రియలో చట్టపరమైన సమస్యలకు అవకాశం ఇవ్వకుండా ప్రత్యేక సమావేశాన్ని సరైన పద్ధతిలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

నిలకడలేని సేన