అనంతపురం: శింగనమల నియోజకవర్గం నార్పల మండల కేంద్రం వేదికగా బుధవారం ‘జగనన్న వసతి దీవెన’ సొమ్ము లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసే కార్యక్రమం విజయవంతమైంది. సీఎం హోదాలో మొదటిసారి విచ్చేసిన వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి విశేష ప్రజాదరణ లభించింది. జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మహిళా సంఘాల సభ్యులు, శింగనమల, నార్పల, యల్లనూరు, పుట్లూరు, బుక్కరాయసముద్రం, గార్లదిన్నె మండలాల నుంచే కాకుండా అన్ని నియోజకవర్గాల నుంచి వైఎస్సార్‌సీపీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అన్ని దారులూ నార్పలవైపే సాగాయి. ఉదయం తొమ్మిది గంటల నుంచే జనం సభా వేదిక వద్దకు చేరుకోవడం మొదలైంది. 10 గంటలకల్లా గ్యాలరీలు నిండిపోయాయి. సభా ప్రాంగణం బయట మూడింతల జనం నిల్చుండిపోయారు. అధికారులు సీఎం ప్రసంగం కోసం ఎల్‌ఈడీ టీవీలు ఏర్పాటు చేశారు.
హోరెత్తిన నినాదాలు
నార్పల పరిసరాలు ‘జై జగన్’ నినాదాలతో మిన్నంటాయి. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టపర్తి ఎయిర్‌పోర్టు నుంచి నార్పలకు హెలికాప్టర్‌లో వచ్చారు. ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్, కలెక్టర్ ఎం.గౌతమి, డీఐజీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి, ఎస్పీ కంచి శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్ కేతన్‌గార్గ్, సహాయ కలెక్టర్ ఎస్.ప్రశాంత్‌కుమార్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వెంట హెలికాప్టర్‌లో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వచ్చారు. సభావేదిక మీద ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి సీఎం నివాళులర్పించి సభను ప్రారంభించారు. కార్యక్రమం అనంతరం సీఎం జగన్‌ను ఎమ్మెల్యే పద్మావతి, ప్రభుత్వ సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి, శింగనమల నియోజకవర్గంలోని ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, వైఎస్సార్‌సీపీ నాయకులు ఘనంగా సన్మానించి, జ్ఞాపికలను అందజేశారు. సీఎం పర్యటన విజయవంతంగా ముగియడం వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో జోష్ నింపింది.
కరుణించిన వరుణుడు
బహిరంగ సభ ప్రారంభానికి రెండు గంటల ముందు వరుణ దేవుడు కరుణించాడు. ఓ మోస్తరు వర్షం పడడంతో పరిసర ప్రాంతాలు చల్లగా మారాయి. సీఎం జగన్ ఎక్కడ సమావేశం పెట్టినా... వరుణ దేవుడు వచ్చి పలుకరించి వెళ్తాడనడానికి నార్పల బహిరంగ సభే నిదర్శనం. జనం సీఎం ప్రసంగం ఆసాంతం కదలకుండా విన్నారు. ప్రసంగం ఆద్యంతం ఈలలు, చప్పట్లతో హోరెత్తింది. పంచతంత్రం కథ ఆకట్టుకునేలా చెప్పడంతో విద్యార్థులు కేరింతలు కొట్టారు. సీఎం ..సీఎం అంటూ నినాదాలు చేశారు. థ్యాంక్యూ మామయ్య అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికీ వాటర్ బాటిల్, స్నాక్స్, జ్యూస్ అందించారు. అలాగే అనంతపురం, బత్తలపల్లి, తాడిపత్రి, నార్పల వైపు వెళ్లే రోడ్లలో ప్రతి 50 అడుగుల దూరంలో వాటర్ ప్యాకెట్లు అందించారు.
ఆత్మీయ వీడ్కోలు
జగనన్న వసతి దీవెన కార్యక్రమం ముగించుకున్న తర్వాత బుధవారం మధ్యాహ్నం నార్పల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలోని హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి ఆత్మీయ వీడ్కోలు లభించింది. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, పార్టీనాయకులు ప్రతి ఒక్కరి నుంచి పూల బొకేలు స్వీకరిస్తూ ఆప్యాయంగా పలకరించారు. నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నాయకులను ప్రభుత్వ సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి ముఖ్యమంత్రికి పరిచయం చేశారు. ఈ సందర్భంగా వారందరితోనూ దాదాపు గంటన్నరపాటు సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా 23 మంది తమ సమస్యలపై ముఖ్యమంత్రికి వినతిపత్రాలు అందజేశారు. వీరిలో 19 మంది విభిన్న ప్రతిభావంతులు ఉన్నారు. కలెక్టర్ గౌతమిని పిలిపించి ముగ్గురి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన వారందరి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
● వేదిక మీద జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, మేరుగు నాగార్జున, కేవీ ఉషశ్రీ చరణ్, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి, పోతుల సునీత, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, కలెక్టర్ ఎం.గౌతమి, శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆలూరి సాంబశివారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్/ఎమ్మెల్సీ తలశిల రఘురాం, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీం అహమ్మద్, రాష్ట్ర నాటక అకాడమీ చైర్‌పర్సన్ రాగే హరిత, ఆర్టీసీ జోనల్ చైర్‌పర్సన్ ఎం.మంజుల, ఏడీసీసీ బ్యాంకు చైర్‌పర్సన్ లిఖిత, అహుడా చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్, నార్పల సర్పంచ్ సుప్రియ, జెడ్పీవైస్ చైర్‌పర్సన్ నాగరత్నమ్మ, ఎంపీపీ నాగేశ్వరరావు, అనంతపురం మేయర్ మహమ్మద్ వసీం, డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్‌రెడ్డి, వాసంతి సాహిత్య, రజక కార్పొరేషన్ చైర్మన్ మీసాల రంగన్న, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ ఎల్‌ఎం ఉమామోహన్‌రెడ్డి, రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్, డీఆర్‌డీఏ పీడీ నరసింహారెడ్డి, ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్ మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి, జేఎన్‌టీయూ అనంతపురం వీసీ ప్రొఫెసర్ జింకా రంగజనార్దన, రెక్టార్ ప్రొఫెసర్ ఎం.విజయకుమార్, అనంతపురం ఆర్డీఓ మధుసూదన్, కళ్యాణదుర్గం ఆర్డీఓ నిశాంత్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, మాజీ ఎమ్మెల్సీ శమంతమణి, ఎంఎస్‌ఎంఈ డైరెక్టర్ రఘునాథరెడ్డి, అనంతపురం మార్కెట్‌యార్డ్ మాజీ చైర్మన్ నార్పల సత్యనారాయణరెడ్డి, స్థానిక ఎంపీటీసీ సభ్యురాలు బాలనాగి భాగ్యలక్ష్మి, తదితరులు ఆశీనులయ్యారు.
ఉన్నత విద్యావంతులను చేయడమే లక్ష్యం
ఉన్నత విద్య అభ్యసిస్తున్న ఎంతోమంది పేద విద్యార్థులకు భోజన, వసతి భారం తల్లిదండ్రుల మీద పడకుండా రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ ‘జగనన్న వసతి దీవెన’ ద్వారా అందజేస్తున్నారని కలెక్టర్ ఎం.గౌతమి తెలిపారు. నార్పలలో నిర్వహించిన వసతి దీవెన కార్యక్రమం బహిరంగ సభను కలెక్టర్ స్వాగతోపన్యాసం చేశారు. ఐటీఐ నుంచి పీహెచ్‌డీ వరకు చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, మైనార్టీ, విభిన్న ప్రతిభావంతులు వసతి దీవెన పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,55,662 మంది పేద విద్యార్థులకు రూ.912.71 కోట్లు వారి తల్లుల ఖాతాల్లో జమ కానుందన్నారు. అనంతపురం జిల్లాకు చెందిన 40 వేల మంది విద్యార్థులకు సంబంధించిన రూ.39.92 కోట్లను వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. ఇలాంటి పథకాలు లేక నిన్న, మొన్నటి తరానికి చెందిన పేదలు ఉన్నత చదువులకు దూరం అయ్యారని పేర్కొన్నారు.
అనంతపురం/శింగనమల/ నార్పల: శింగనమల నియోజకవర్గానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వరాల జల్లు కురిపించారు. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి నియోజకవర్గ అభివృద్ధి పనుల గురించి విన్నవించగా సీఎం వెంటనే ఆమోదం తెలిపారు. నియోజకవర్గం అభివృద్ధికి ఎల్లవేళలా సహకారం అందిస్తానని స్పష్టం చేశారు.
చాగల్లు రిజర్వాయర్ ముంపు గ్రామాలైన ఉల్లికల్లు, ఉల్లికంటిపల్లి ప్రజలకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద రూ.168 కోట్లు మంజూరు.
ఈస్ట్ నరసాపురంలో బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి రూ.35 కోట్ల కేటాయింపునకు ఆమోదం.
శింగనమల మండల కేంద్రంలో రూ.2 కోట్ల నిధులతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భవన్ నిర్మాణానికి ఆమోదం.
మిడ్‌పెన్నార్ డ్యాం నిర్వహణ నిమిత్తం రూ.3 కోట్ల నిధులు విడుదల.
నార్పల జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో 800 మంది విద్యార్థినులు ఉన్నారు. పాఠశాల నిర్వహణకు రెండు ఎకరాలు కావాలని కోరగా, ఇందుకు కోటి రూపాయల నిధులు కేటాయిస్తూ సీఎం ఆమోదం.
చిత్రావతి నది మీద యల్లనూరు మండలంలో కేడీ రోడ్డు నుంచి చింతకాయమందకు రాకపోకల నిమిత్తం రూ.11.75 కోట్ల వ్యయంతో బ్రిడ్జి నిర్మాణానికి ఆమోదం.
చిత్రావతి నది మీద కోడుమూర్తి నుంచి చిలమకూరు వరకు రూ.15 కోట్ల వ్యయంతో కాజ్‌వే నిర్మాణానికి అంగీకారం.
పుట్లూరు, యల్లనూరు మండలాల ప్రజలు పులివెందుల నియోజకవర్గానికి ఆనుకుని ఉండండం వల్ల పులివెందులను కూడా తమ సొంత నియోజకవర్గంలా భావిస్తుంటారు. పుట్లూరు మండలంలో సాగు, తాగునీరు సమస్యను పరిష్కరించడానికి గండికోట రిజర్వాయర్ నుంచి సుబ్బరాయసాగర్ ట్యాంక్‌కు లిఫ్ట్ ద్వారా నీరందించే పథకానికి రూ.250 కోట్లు మంజూరు.
Comments
Please login to add a commentAdd a comment