అనంతపురం: వినాయకుడి విగ్రహం ఎదుట బైక్‌లతో విన్యాసాలు ఏమిటని ప్రశ్నించిన వారిపై దాడి చేయగా ఒకరు మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి మండల పరిధిలోని దొరిగిల్లు క్వార్టర్స్‌లో జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు... వినాయక పండుగ సందర్భంగా దొరిగిల్లు క్వార్టర్స్‌లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో కొందరు యువకులు విగ్రహం ఎదుట బైక్‌పై విన్యాసాలు చేశారు. దీంతో గ్రామస్తులు యువకులను మందలించారు. దీంతో సదరు యువకులు దొరిగిల్లు గ్రామంలోకి వెళ్లి వారి కుటుంబ సభ్యులు, బంధువులను తీసుకొచ్చారు.
అక్కడే ఉన్న గ్రామస్తులతో ఘర్షణ పడ్డారు. మాటామాటా పెరగడంతో ఇరువర్గాలూ కర్రలతో దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో అనంతయ్య (55) అనే వ్యక్తి తలకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ముదిగుబ్బకు తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘర్షణలోనే గాయపడిన ఆంజనేయులు, నారాయణమ్మ, తులసి, నాగముణమ్మ, వెంకటనారాయణను చికిత్స నిమిత్తం కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న ధర్మవరం డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ యతీంద్ర, లా అండ్ ఆర్డర్ సీఐ హేమంత్‌కుమార్ అర్ధరాత్రి సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. బుధవారం ఉదయం అడిషనల్ ఎస్పీ విష్ణు దొరిగిల్లు క్వార్టర్స్‌కు చేరుకొని ఘర్షణకు దారి తీసిన కారణాలపై ఆరా తీశారు. ఇరువర్గాల వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనలో 13 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల అదుపులో 13 మంది
దొరిగిల్లు క్వాటర్స్‌లో మంగళవారం చోటు చేసుకున్న ఘర్షణలో ఇరు వర్గాలకు చెందిన 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఘటనకు సంబంధించి విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment