అసమ్మతుల బెడదతో ఆపసోపాలు
ఎమ్మెల్యే సీటు ఆశించి ఎంపీ సీటుతో సర్దుకున్న బీకే
అనంతపురం, గుంతకల్లు సీట్లపై తేల్చని చంద్రబాబు
అనంతపురం ఎంపీ సీటు జేసీ పవన్‌కు ఇచ్చేందుకు మొగ్గు!
ధనబలం కలిగిన అభ్యర్థులు బీసీల్లో లేనందునే పవన్ వైపు మొగ్గు
పార్టీకి పనిచేసిన వారికి ప్రాధాన్యం లేదంటున్న తెలుగు తమ్ముళ్లు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: సార్వత్రిక ఎన్నికల వేళ అడుగడుగునా అసమ్మతుల బెడద తెలుగుదేశం పార్టీని వేధిస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబు ప్రజాబలం ఉన్న వారికంటే ధనబలం ఉన్నవారికి సీట్లు ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ కారణంగానే రెండు ఎమ్మెల్యే, రెండు ఎంపీ సీట్లు ప్రకటించాల్సి ఉండగా.. తాజాగా వచ్చిన జాబితాలో హిందూపురం ఎంపీ టికెట్ మాత్రమే ప్రకటించారు. మిగతా అనంతపురం ఎంపీ, ఎమ్మెల్యేతో పాటు గుంతకల్లు సీటు వెల్లడించలేదు. ఇక్కడ ఎవరికి టికెట్ ఇస్తే ఎవరు ధర్నాలకు దిగుతారోనన్న భయం బాబును వెంటాడుతున్నట్టు తెలుస్తోంది.
బీసీల్లో డబ్బున్నవారు లేరని..
తెలుగుదేశం పార్టీకి 30 ఏళ్లుగా జెండా మోసింది బీసీ వర్గాలే. అలాంటి బీసీ వర్గాలను బాబు తన మనసులోనుంచి చెరిపేశారు. ఓ వైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండు పార్లమెంటు సీట్లనూ బీసీలకు కేటాయించింది. టీడీపీ మాత్రం అతి కష్టమ్మీద హిందూపురం టికెట్‌ను బీసీ వర్గానికి చెందిన పార్థసారథికి ఇచ్చింది. అనంతపురం టికెట్ మాత్రం బాగా డబ్బున్న జేసీ పవన్‌కు ఇవ్వాలని చూస్తున్నారు. పవన్ అయితే పార్టీకి కోట్ల రూపాయలు ఇవ్వగలరని, బీసీల్లో అలా డబ్బు ఇచ్చే నేతలు ఎక్కడున్నారనేది చంద్రబాబు అభిప్రాయం. మరోవైపు కుటుంబానికి ఒక్కటే సీటు అని పరిటాల కుటుంబానికి రెండు సీట్లు ఇవ్వకుండా, జేసీ కుటుంబానికి మాత్రం రెండు సీట్లు ఇస్తుండటంపైనా బాబు తన మార్కు రాజకీయం చేస్తున్నారనేది కేడర్ భావన.
ఆ రెండింటిపై పీటముడి
అనంతపురం అర్బన్ సీటును ముందు జనసేనకు ఆశచూపి.. తర్వాత తెలుగుదేశం పార్టీ లాగేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే బలిజలు ఆగ్రహిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎవరికి టికెట్ ఇస్తే ఎలాంటి ముప్పు ముంచుకొస్తుందో అని ఇంకా అభ్యర్థిని తేల్చలేదు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి టికెట్ తనదే అంటూ ప్రచారం చేస్తున్నారు. బాబు తనకే హామీ ఇచ్చినట్టు కూడా చెబుతున్నారు. అయినా సరే ప్రకటించలేదు. ఈ సీటు ప్రభాకర్‌చౌదరికి ఇస్తే బలిజలతో పాటు వివిధ వర్గాలు ఆయనకు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
► ఇక గుంతకల్లు ఎమ్మెల్యే టికెట్ తనదే అని మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం చెబుతున్నారు. ఇక్కడ సీటు ఎవరికనేది వెల్లడిస్తే మాజీ ఎమ్మెల్యే జితేందర్‌గౌడ్ నుంచి ఎలాంటి అసమ్మతి వస్తుందోనన్న భయం పట్టుకుంది. మొన్నటిదాకా జయరాంను పేకాట మంత్రి అని, బెంజ్‌కారు మంత్రి అని తిట్టిన చంద్ర బాబు.. ఇప్పుడు ఆయనకే సీటు ఇస్తున్నట్టు వస్తున్న వార్తలను టీడీపీ కేడర్ జీర్ణించుకోలేకపోతోంది. దీన్నిబట్టి చూస్తే ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రతి నియోజకవర్గంలోనూ అసమ్మతుల బెడదతో టీడీపీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment