
పాపపుణ్యాల క్షమార్హ దినంగా షబేఖదర్
నేడు జాగరణకు ముస్లింలు సన్నద్ధం
బత్తలపల్లి: ముస్లింలకు శుభప్రదమైన, పుణ్యప్రదమైన రాత్రి షబేఖదర్ (షబ్–ఏ–ఖదర్) రానేవచ్చింది. రంజాన్ మాసంలోని చివరి వారంలో 26వ రోజు రాత్రిని షబేఖదర్‌గా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీనినే సతామి, లైలతుల్‌ఖదర్ అని కూడా పిలుస్తారు. షబే అంటే రాత్రి, ఖదర్ అంటే గౌరవమైన అని అర్థం. ఈ ఒక్కరోజు జాగరణతో చేసే ఆరాధనతో వెయ్యి మాసాల పుణ్యఫలం దక్కుతుందని ఖురాన్ ప్రబోధిస్తోంది.
రంజాన్ మాసం ఏం చెబుతోంది..
రంజాన్ మాసంలో చేసిన ఆరాధనలు, ఆచరించిన ఉపవాసాలు, సత్‌క్రియలన్నీ మనం పెంచే మొక్కల్లాంటివే. మొక్క నాటి నప్పటి నుంచి నీరు పోసి సంరక్షించినప్పుడే అది ఎదిగి ఫలాలను అందజేస్తుంది. లేకుంటే కాస్త పెరిగుతున్న సమయంలోనే వాడి పోతుంది. అలాగే రంజాన్ మాసంలో పాటించిన ఆరాధనలు, సత్‌క్రియలను మిగిలిన 11 నెలలూ ఆచరణలో పెట్టినప్పుడే వాటి ఫలాలు అనుభవించగలుగుతామని చెబుతోంది. విశ్వాసులు రంజాన్ తర్వాత వచ్చే 11 నెలలూ అల్లాహ్ వైపు తమ దృష్టి మరల్చాలన్నదే ఖురాన్ ఉద్బోధ.
నేడు జాగారణ..
వేయి మాసాల రాత్రుల కన్నా ఘనమైన రాత్రి లైలతుల్‌ఖదర్ అని ముస్లింలు విశ్వసిస్తారు. ఈ రాత్రే అల్లా ఆజ్ఞ మేరకు దివి నుంచి భూవికి దైవ దూతల ద్వారా దివ్య ఖురాన్ అవతరించిందని నమ్మకం. ఖురాన్ ఆవిర్భావాన్ని పురస్కరించుకుని ఆ రోజు రాత్రంతా ప్రత్యేక ప్రార్థనలతో ముస్లింలు జాగరణ చేస్తారు. ఇందుకు శనివారం వేదికై ంది. రాత్రి నుంచి శుభోదయం వరకూ మేల్కోని దైవరాధనలో గడపడం వల్ల గత 11 నెలలుగా చేసిన పాపాలను అల్లాహ్ క్షమిస్తాడని ముస్లింల విశ్వాసం. అందుకే షబేఖదర్‌ను ఇన్సాఫ్‌కే రాత్ (న్యాయ నిర్ణేత రాత్రి) అని కూడా భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో షబేఖదర్‌ను షబేఖదర్‌ను శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముస్లింలు సిద్ధమయ్యారు.
సకల పాపాలు ప్రక్షాళన
రంజాన్ మాసంలో షబేఖదర్ పేరుతో చేసే జాగరణ సకల పాపాలను ప్రక్షాళన చేస్తుంది. ఈ రాత్రి నమాజ్‌లో విధిగా అందరూ పాల్గొనాలి. ఇబాదత్ చేస్తే వెయ్యి మాసాల పుణ్యఫలం దక్కుతుంది. ఇది చాలా ప్రత్యేకమైన రాత్రి. మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే అల్లాహ్ మనం గతంలో చేసిన పాపాలన్నింటిని తుడిచేసి పుణ్యఫలాలను అందజేస్తారని ఖురాన్ ప్రబోధిస్తోంది.
– కరీంసాహెబ్, ముతవల్లి, బత్తలపల్లి
