అనంతపురం అగ్రికల్చర్: ‘అన్నదాత సుఖీభవ’ కింద ఏటా ప్రతి రైతుకూ రూ.20 వేల పెట్టుబడిసాయం అందిస్తామని ఎన్నికల సమయంలో ఘనంగా చెప్పిన సీఎం చంద్రబాబు.. అధికారంలోకి రాగానే దాని ఊసే ఎత్తడం లేదు. దీంతో రైతులకు పెట్టుబడి సాయం ఇప్పట్లో అందే పరిస్థితి కనిపించడం లేదు. అటు కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద ఈ ఏడాది జూన్, అక్టోబర్‌లో రెండు విడతల కింద రూ.2 వేల చొప్పున రూ.4 వేల ప్రకారం రైతుల ఖాతాల్లోకి జమ చేసిన విషయం తెలిసిందే. జనవరిలో మూడో విడతగా రూ.2 వేలు జమ చేయనున్నారు. ఈ క్రమంలో బాబు ప్రకటించిన రూ.20 వేలు గుర్తుకు వస్తుందనే దురాలోచనతో వ్యవసాయశాఖ కూడా తన వంతుగా రాష్ట్ర సర్కారుకు కొమ్ము కాస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పీఎం కిసాన్ పథకంపై ప్రచారం చేయకుండా మిన్నకుండిపోతున్నారు. పీఎం కిసాన్ కింద సొమ్ము జమ కాలేదంటూ చాలా మంది రైతులు వాపోతున్నా పట్టించుకోవడం లేదు. ఆర్‌ఎస్‌కే సిబ్బంది మొదలు ఏఓ, ఏడీఏలతో పాటు జేడీఏ కార్యాలయం కూడా స్పందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందే ఈకేవైసీ, ఆధార్ సీడింగ్, మొబైల్ అనుసంధానం చేయించుకున్నా పీఎం కిసాన్ సొమ్ము జమ కాలేదని వాపోతున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది రెండో విడతగా (ఓవరాల్‌గా 18వ విడత) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 5న రూ.2 వేలు సొమ్ము విడుదల చేశారు. 18వ విడత కింద 2.79 లక్షల మంది రైతులకు రూ.55.83 కోట్లు ఇచ్చారు. పీఎం కిసాన్ విడుదల కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలని వ్యవసాయశాఖకు ఆదేశాలు ఉన్నా పట్టించుకోలేదు. జిల్లా వ్యాప్తంగా జేడీఏతో పాటు 31 మండలాల ఏఓలు, డివిజన్ ఏడీఏలు ఈ కార్యక్రమాన్ని వీక్షించలేదని తెలుస్తోంది. పామిడి, మరో మండలం నుంచి మాత్రమే పీఎం కిసాన్ విడుదల కార్యక్రమానికి ఆన్‌లైన్‌లో హాజరైనట్లు సమాచా రం. గత ఐదేళ్లూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో క్రమం తప్పకుండా ‘వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్’ కింద ఏటా రూ.13,500 ప్రకారం ఐదేళ్లలో రూ.67,500 మేర లబ్ధి చేకూరినట్లు రైతులు గుర్తు చేసుకుంటున్నారు.
సొమ్ము జమ కాలేదంటున్న రైతులు
పట్టించుకోని అధికారులు
Comments
Please login to add a commentAdd a comment