ఆరిన ఆశల దీపం.. అయ్యో ఎంత ఘోరం
● బైకును ఢీ కొన్న కారు
● మూడేళ్ల బాలుడి దుర్మరణం
● తల్లిదండ్రులకు తీవ్రగాయాలు
పెద్దవడుగూరు: బైకును కారు ఢీ కొన్న ఘటనలో మూడేళ్ల బాలుడు దుర్మరణం పాలైన ఘటన మండల పరిధిలోని గోపురాజుపల్లి గ్రామ సమీపంలో ఆదివారం జరిగింది. వివరాలు.. మండలంలోని దిమ్మగుడి గ్రామానికి చెందిన సురేంద్ర రెడ్డి తన భార్య సులోచనమ్మ, కుమారుడు రిత్విక్ రెడ్డి(3)తో కలిసి ఆదివారం పెద్దపప్పూరు మండలం చిన్నపప్పూరులో జరుగుతున్న అశ్వత్థం తిరునాలకు బైకుపై వెళ్లారు. స్వామిని దర్శించుకున్న అనంతరం స్వగ్రామానికి తిరుగు పయనమయ్యారు. మార్గమధ్యంలో గోపురాజుపల్లి వద్ద వీరి బైకును ఓ కారు వేగంగా ఢీకొంది. ప్రమాదంలో తీవ్ర గాయాలైన బాలుడు రిత్విక్ రెడ్డి ఘటనా స్థలిలోనే ప్రాణాలు విడిచాడు. సురేంద్ర రెడ్డి, సులోచనమ్మకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. తమ ఆశలదీపం ప్రాణాలు విడిచాడని తెలుసుకున్న వారు.. ఘటనాస్థలిలోనే సొమ్మసిల్లి పడిపోయారు. కారు డ్రైవర్ చిన్న దస్తగిరి మద్యం మత్తులో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. బైకును ఢీకొన్న అనంతరం కారు బోల్తా పడింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment