స్వగ్రామానికి జవాన్ లక్ష్మన్న భౌతికకాయం
కళ్యాణదుర్గం/బ్రహ్మసముద్రం: మూడు రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందిన బీఎస్‌ఎఫ్ జవాన్ లక్ష్మన్న (33) భౌతికకాయాన్ని ఆదివారం రాత్రి ఆయన స్వగ్రామమైన బ్రహ్మసముద్రం తీసుకొచ్చారు. ముందుగా ఢిల్లీ నుంచి ఆర్మీ ప్రత్యేక విమానంలో బెంగళూరుకు తీసుకొచ్చారు. ఆర్మీ జవాన్లు గౌరవ వందనం సమర్పించిన అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గాన మినీ బస్‌లో భౌతిక కాయాన్ని గ్రామానికి తరలించారు. లక్ష్మన్నను కడసారి చూసేందుకు బంధువులు, స్నేహితులు, స్థానికులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. భౌతికకాయం వద్ద కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తన కళ్లెదుటే భర్త మరణిస్తాడని కలలో కూడా ఊహించలేదంటూ లక్ష్మన్న భార్య లక్ష్మి విలపించడం అందరి వెంట కన్నీళ్లు పెట్టించింది. తమ తండ్రి ఎక్కడని పిల్లలు అడిగితే ఏం చెప్పాలంటూ పిల్లల్ని పట్టుకుని ఏడుస్తున్న ఆమెను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. ఉన్నత స్థానానికి వెళ్లిన కుమారుడు ఇలా విగత జీవుడిగా తిరిగి వస్తాడని అనుకోలేదంటూ తల్లిదండ్రులు సుశీలమ్మ, రామచంద్రలు రోదించడం కలచివేసింది. లక్ష్మన్నతో తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుని బంధువులు, స్నేహితులు విలపించారు. బాధిత కుటుంబ సభ్యులను ఐటీబీపీ హెడ్ కానిస్టేబుల్ పిల్లలపల్లి నరసింహారెడ్డి పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
నేడు అంత్యక్రియలు..
జవాన్ లక్ష్మన్న అంత్యక్రియలు సోమవారం జరగనున్నాయి. బ్రహ్మసముద్రం మండల కేంద్రంలోని పశువైద్యశాల సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్థలంలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు తహసీల్దార్ సుమతి, ఎస్‌ఐ నరేంద్రకుమార్ తెలిపారు.
కన్నీరుమున్నీరైన కుటుంబసభ్యులు, గ్రామస్తులు
నేడు సైనిక లాంఛనాలతో
అంత్యక్రియలు
స్వగ్రామానికి జవాన్ లక్ష్మన్న భౌతికకాయం
స్వగ్రామానికి జవాన్ లక్ష్మన్న భౌతికకాయం
Comments
Please login to add a commentAdd a comment