ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
● ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు
చంద్రశేఖర్ రెడ్డి
అనంతపురం టవర్‌క్లాక్: ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి కోరారు. ఆదివారం స్థానిక ఎన్జీవో హోంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నాల్గో తరగతి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. 11వ పీఆర్సీ కమిటీని ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. ఉద్యోగులకు ఐఆర్ 40 శాతంతో పాటు కరువు భత్యం విడుదల చేయాలన్నారు. జీపీఎఫ్, సరెండర్ లీవ్ బకాయిలు తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇటీవల రాష్ట్ర పబ్లిసిటీ సెక్రటరీగా ఎన్నికైన ముక్తియార్ అహ్మద్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సంఘం గౌరవాధ్యక్షులు కుళ్లాయప్ప, గౌస్‌పీరా, జిల్లా కార్యదర్శి పెద్దన్న, నాయకులు మహబూబ్‌బాషా, జయచంద్ర, షెక్షావలి, ప్రకాష్, నాగభూషణం, కిరణ్ కుమార్, మహేష్, స్వర్ణలత, ఆదిలక్ష్మి, బాబు, తదితరులు పాల్గొన్నారు.
టమాట మార్కెట్‌ను
పరిశీలించిన జేసీ
అనంతపురం సెంట్రల్: రూరల్ మండల పరిధిలోని కక్కలపల్లి టమాట మార్కెట్‌ను ఆదివారం జాయింట్ కలెక్టర్ శివ్‌నారాయణ్ శర్మ పరిశీలించారు. మార్కెట్‌లో పలుకుతున్న ధరలను రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు నష్టం కలగకుండా రేట్లు నిర్ణయించాలని విక్రయదారులకు సూచించారు. కార్యక్రమంలో హార్టికల్చర్ డీడీ నరసింహారావు, రాప్తాడు మార్కెట్‌యార్డు సెక్రటరీ రామ్ ప్రసాద్, రైతుబజార్ ఎస్టేట్ ఆఫీసర్ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
విషపు నీరు తాగి
గొర్రెలు మృతి
బ్రహ్మసముద్రం: విషతుల్యమైన నీటిని తాగి 29 గొర్రెలు మృతిచెందాయి. వివరాలు.. బ్రహ్మసముద్రం మండలం భైరవానితిప్ప గ్రామానికి చెందిన కాపరులు బొమ్మన్న, రామాంజనేయులు, కోళ్ల తిప్పేస్వామి... గొర్రెల పోషణతో జీవనం సాగిస్తున్నారు. ఆదివారం గ్రామ సమీపంలోని పొలాల్లో గొర్రెలను మేపునకు వదిలారు. ఈ క్రమంలో మధ్యాహ్నం పొలాల్లోని నీటిని గొర్రెలు తాగాయి. అయితే అప్పటికే పంటలకు పిచికారీ చేసేందుకు ఆ నీటిలో యూరియా కలిపిన విషయాన్ని కాపరులు గుర్తించలేదు. కాసేపటి తర్వాత ఒకదాని వెనుక ఒకటి గొర్రెలు మృత్యువాత పడుతుండడంతో స్థానికుల నుంచి సమాచారం అందుకున్న మండల పశు వైద్యాధికారి, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. అప్పటికే బొమ్మన్నకు చెందిన 9, రామాంజినేయులుకు చెందిన 12, కోళ్ల తిప్పేస్వామికి చెందిన 8 గొర్రెలు మృతి చెందాయి. అస్వస్థతకు గురైన మరో 15 గొర్రెలకు వైద్యాధికారి చికిత్స అందజేశారు.
దంపతులపై దాడి
గుత్తి రూరల్: మండలంలోని గొందిపల్లిలో దంపతులపై దాడి జరిగింది. బాధితులు తెలిపిన మేరకు..గ్రామానికి చెందిన నాగరాజు, లక్ష్మి అదే గ్రామానికి చెందిన నరసింహులు, లక్ష్మి దంపతుల ఇళ్లు పక్కపక్కనే ఉన్నాయి. అయితే ఇంటి పక్కన చెత్త వేశారనే అంశంపై శనివారం గ్రామంలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. దీనిపై ఓ వర్గం పోలీసులను ఆశ్రయించడంతో స్టేషన్‌కు నరసింహులు, లక్ష్మి దంపతులను పిలిపించి విచారించారు. ఆదివారం మరోసారి ఇరువర్గాల మధ్య గొడవ చోటు చేసుకుంది. నరసింహులు, లక్ష్మి దంపతులపై కరుణశేఖర్, కొత్తపేటకు చెందిన నాగరాజు, లక్ష్మి దాడి చేసి గాయపరిచారు. దంపతులను కుటుంబసభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
Comments
Please login to add a commentAdd a comment