తనిఖీ తర్వాతే విద్యార్థులను అనుమతించాలి
అనంతపురం ఎడ్యుకేషన్: మార్చి 1 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని, విద్యార్థులను తనిఖీ చేసిన తర్వాతనే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించాలని ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి వెంకటరమణనాయక్ ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్ ఆఫీసర్లు, కస్టోడియన్లు, అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లతో స్థానిక కొత్తూరు ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెంకటరమణనాయక్ మాట్లాడుతూ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు, ప్రతి పరీక్ష కేంద్రంలో అన్నీ గదులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. సీసీ కెమెరాల లైవ్ స్ట్రీమింగ్‌ను రోజూ గమనిస్తూ ఉండాలన్నారు. పరీక్ష కేంద్రంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్‌ఫోన్లను అనుమతించొద్దన్నారు. సిబ్బంది, ఇన్విజిలేటర్‌తో సహా పరీక్ష కేంద్రంలోకి సెల్‌ఫోన్ అనుమతించరని స్పష్టం చేశారు. విధుల్లో ఉండే అధికారులు, ఇతర సిబ్బంది ఫొటోతో కూడిన గుర్తింపు కార్డును తప్పనిసరిగా ధరించాలన్నారు. విద్యార్థులకు కేటాయించిన గదుల సిట్టింగ్ ప్లాన్‌ను 3–4 ప్రదేశాలలో ప్రదర్శించాలన్నారు. సమావేశంలో పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు ఆర్. సాలాబాయి, కె.నాగ రత్నమ్మ, సుభద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment