రాప్తాడులో రౌడీ రాజ్యం | - | Sakshi
Sakshi News home page

రాప్తాడులో రౌడీ రాజ్యం

Published Sat, Mar 15 2025 12:20 AM | Last Updated on Sat, Mar 15 2025 12:20 AM

రాప్తాడులో రౌడీ రాజ్యం

రాప్తాడులో రౌడీ రాజ్యం

చట్టాన్ని టీడీపీ చుట్టంగా మార్చుతున్న పోలీసులు

ఏకపక్షంగా వెళ్తామంటే చూస్తూ ఊరుకోం

రైతుల సమస్యలపై రాజీ పడను...జైలుకు వెళ్లేందుకూ సిద్ధం

మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి

అనంతపురం ఎడ్యుకేషన్‌: శ్రీమేము అధికారంలో ఉన్న ఐదేళ్లలో రాప్తాడు నియోజకవర్గంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయి. ఎక్కడా నిర్భందాలు చేయలేదు. అనవసరంగా ప్రతిపక్ష పార్టీ వారిని పిలిపించి అక్రమ కేసులు బనాయించలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి పరిటాల సునీత ఎమ్మెల్యే అయిన తర్వాత రౌడీ రాజ్యం నడుస్తోంద’ని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నగర శివారులోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆత్మకూరు మండలం సిద్ధరాంపురంలో కురుబ బాలన్న అనే యువకుడిని టీడీపీ వారు కట్టెలతో దాడి చేస్తే పరామర్శించడానికి వెళ్తానంటే పోలీసులు అనుమతులు ఇవ్వలేదన్నారు. సిద్ధరాంపురం ఏమైనా పాకిస్తాన్‌లో ఉందా.. అందుకు ప్రత్యేక వీసాలు కావాలా.. అని ప్రశ్నించారు. రామగిరి మండలం పోలేపల్లిలో లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షికోత్సవానికి వెళ్తుంటే దాదులూరు వద్ద డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలు వచ్చి అడ్డుకుని బందోబస్తు ఇవ్వలేమని పర్యటన వాయిదా వేసుకోవాలంటూ చెప్పారన్నారు.

పోలీసులు ప్రజల కోసమా..సునీత కోసమా?

పోలీసులు ప్రజల కోసం పని చేస్తున్నారా? లేదంటే పరిటాల సునీత కోసం పని చేస్తున్నారా? అని మాజీ ఎమ్మెల్యే మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగా లా అండ్‌ ఆర్డర్‌ కోసం పని చేస్తున్నారా? లేదంటే టీడీపీని బలపరిచేందుకు పని చేస్తున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలేపల్లికి వస్తే పెద్దపెద్ద గొడవలు అవుతాయని రామగిరి ఎస్‌ఐ సుధాకర్‌యాదవ్‌ చెబుతున్నారని, ఆయన టీడీపీ ఏజెంటుగా పని చేస్తున్నారా? అని నిలదీశారు. ఊరిలో లేని సమస్యను సృష్టిస్తూ పోలీసు వ్యవస్థను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. వాస్తవానికి ఆ గ్రామంలో టీడీపీ వాళ్లకు లేని ఉద్దేశాలను ఎస్‌ఐ కల్పిస్తూ ఎస్పీ, డీఎస్పీని తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. తమ పార్టీ నేతలు స్టేషన్‌కు వెళ్తే అగౌరవంగా మాట్లాడటడంతోపాటు కింద కూర్చోమని చెబుతారని ఎస్‌ఐ సుధాకర్‌యాద్‌పై మండిపడ్డారు.

సీఐ, ఎస్‌ఐలు పద్ధతులు మార్చుకోవాలి

అనంతపురం రూరల్‌ మండలంలోని తమ పార్టీ నేతలను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. పుట్టపర్తిలో జరిగిన యువత పోరు కార్యక్రమానికి పెద్ద ఎత్తున వాహనాల్లో వెళ్లడంతో వారికి కళ్లు ఎర్రబడ్డాయన్నారు. జనాలను బాగా పిలుచుకెళ్లిన లీడర్లను టార్గెట్‌ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని టీడీపీ చుట్టంగా మార్చొద్దని పోలీసులకు హితవు పలికారు. తాను గుండీలు ఇప్పుతా రా కొట్లాడదామని రాప్తాడు సీఐ పిలుస్తారని, ఆయన సీఐనా రౌడీనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మకూరులో లాఅండ్‌ ఆర్డర్‌ సమస్యంతా ఇటుకలపల్లి సీఐతోనే ఉత్పన్నమవుతోందన్నారు. తోపుదుర్తిలో 30 మంది ఇంట్లోకి దూరి మహిళపై దాడి చేస్తే..బాధితులపైనే కేసు కడతాడన్నారు. వారి ఆగడాలు చూస్తూ ఊరుకున్నారంటే తాము సంయమనం పాటించమని చెప్పడమే కారణమనేది గుర్తు పెట్టుకోవాలన్నారు. ఇప్పటికై నా ఇటుకులపల్లి, రాప్తాడు సీఐలు, రామగిరి ఎస్‌ఐ పద్ధతులు మార్చుకోవాలని హితవుపలికారు.

చంద్రబాబు, సునీత చరిత్రహీనులుగా నిలిచిపోతారు

లైనింగ్‌పనులు జరిగితే రాప్తాడు నియోజకవర్గంలో లక్షల ఎకరాలు బీళ్లుగా మారే ప్రమాదం ఉందని, దీనిపై రైతులను చైతన్యం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని ప్రకాష్‌రెడ్డి అన్నారు. ఈ పనులు జరిగితే చంద్రబాబు, పరిటాల సునీత చరిత్ర హీనులుగా నిలిచిపోతారన్నారు. నియోజకవర్గ రైతుల సమస్యలపై రాజీ పడననని, జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమన్నారు. సిద్ధరాంపురం గ్రామానికి చెందిన బాధితుడు కురుబ బాలన్నను పరామర్శించడానికి వెళ్లనీయకపోవడంతో ఇక్కడికే బాధితుడిని పిలిపించి మీడియాకు చూపించారు. అనంతపురం రూరల్‌ జెడ్పీటీసీ చంద్రకుమార్‌, ఆత్మకూరు ఎంపీపీ హేమలత, వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ నేత కురుబ నాగిరెడ్డి, ఆత్మకూరు మండల కన్వీనరు బాలపోతన్న, నాయకులు నీరుగంటి నారాయణరెడ్డి, రామగిరి కన్వీనర్‌ మీనుగ నాగరాజు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement