‘రాజా’కు ఘన వీడ్కోలు
గుంతకల్లు టౌన్: రైళ్లల్లో పేలుడు పదార్థాల గుర్తింపు, లిక్కర్ అక్రమ రవాణాను అడ్డుకోవడంతో పాటు విధి నిర్వహణలో సమర్థవంతమైన సేవలందించిన సాహస జాగిలం రాజా (శునకం)కు ఆర్‌పీఎఫ్ పోలీసులు ఆదివారం ఘనంగా వీడ్కోలు పలికారు. పదేళ్ల సర్వీసును పూర్తి చేసుకున్న రాజా పదవీ విరమణను స్థానిక ప్రభాత్‌నగర్‌లోని ఆర్‌పీఎఫ్ డాగ్ స్క్వాడ్ ఆఫీసులో ఘనంగా నిర్వహించారు. అందంగా అలంకరించిన పోలీసు జీపుపై జాగిలాన్ని కూర్చోబెట్టి పూలమాల, శాలువాతో సత్కరించారు. పూలు చల్లుకుంటూ వీధుల్లో ఊరేగించారు. ఆర్‌పీఎఫ్ డివిజనల్ సెక్యూరిటీ వింగ్ కమిషనర్ మురళీకృష్ణ మాట్లాడుతూ... రైళ్లల్లో దొంగలను పట్టించడంతో పాటు అనేక కేసుల్లో మిస్టరీని ఛేదించడంలో జాగిలం రాజా విశేష ప్రతిభ కనబరిచేదన్నారు. కార్యక్రమంలో ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ బెన్నయ్య, ఏఎస్‌ఐ అబ్రహామ్, డాగ్ హ్యాండ్లర్స్ టి.శంకర్, డి.రఘు, సిబ్బంది పాల్గొన్నారు. కాగా పదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న జాగిలాన్ని నాంధేడ్‌లోని అనిమల్ సొసైటీలో అప్పగించనున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment