నేటి నుంచి టెన్త్‌ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి టెన్త్‌ పరీక్షలు

Published Mon, Mar 17 2025 9:50 AM | Last Updated on Mon, Mar 17 2025 11:27 AM

నేటి నుంచి టెన్త్‌ పరీక్షలు

నేటి నుంచి టెన్త్‌ పరీక్షలు

అనంతపురం ఎడ్యుకేషన్‌: విద్యార్థుల జీవితంలో తొలిసారి పబ్లిక్‌ పరీక్షలు రాసే రోజు రానే వచ్చింది. జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో మొత్తం 135 కేంద్రాల్లో 32,803 మంది రెగ్యులర్‌, ప్రైవేట్‌ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలుంటాయి. ఇప్పటికే అన్ని కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించారు. ముఖ్యంగా తాగునీరు, ఫర్నీచరు, విద్యుత్‌ సదుపాయం అన్ని కేంద్రాల్లోనూ ఉండేలా అధికారులు దృష్టి సారించారు.

ఆర్జేడీ ప్రత్యేక ఫోకస్‌..

పరీక్షల నిర్వహణలో తనదైన ముద్ర వేసుకున్న పాఠశాల విద్య ఆర్జేడీ జిల్లాపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టారు. మూడు రోజులుగా జిల్లాలోనే మకాం వేశారు. పరీక్షల నిర్వహణలో ఏ చిన్నపొరబాటు చేసిన ఉపేక్షించబోనని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది.

గంట ముందుగానే చేరుకోవాలి..

తొలిరోజు విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. హాల్‌టికెట్‌ నంబరు ఆధారంగా ఏ గది ఎక్కడుందో చూసుకోవాలని చెబుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం ఉంటుంది. హాల్‌టికెట్‌ చూపిస్తే చాలు ప్రయాణానికి అవకాశం కల్పిస్తారు. పరీక్షల నిర్వహణ విధుల్లో పాల్గొనే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పోలీస్‌స్టేషన్ల నుంచి ప్రశ్నపత్రాలు తీసుకొచ్చే సమయం, వాటిని ఓపెన్‌ చూసి విద్యార్థులకు అందజేసే సమయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. మీడియంను ఒకటికి రెండుసార్లు పరిశీలించి సంబంధిత ప్రశ్నపత్రం ఇవ్వాలని అధికారులు చెబుతున్నారు. ఏమాత్రం తారుమారైనా విద్యార్థులు నష్టపోతారనే విషయాన్ని ఇన్విజిలేటర్లు గుర్తు పెట్టుకోవాలని చెబుతున్నారు. పేపర్‌ లీక్‌ చేస్తే అడ్డంగా బుక్‌ అవుతారని, భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరిస్తున్నారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో కేంద్రాల్లోకి సిబ్బంది కోసం టీ, కాఫీ బయట నుంచి తీసుకురాకూడదు. పొరబాటున ఏ ఒక్క వ్యక్తి బయటకు వచ్చినా అందుకు చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్ట్‌మెంటల్‌ అధికారి, అడిషనల్‌ డిపార్ట్‌మెంటల్‌ అధికారి, ఎంఈఓలను బాధ్యులను చేస్తారు.

పటిష్ట బందోబస్తు

అనంతపురం: పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ పి. జగదీష్‌ పేర్కొన్నారు. విద్యార్థులు సెల్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, పర్సులు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులను పరీక్ష కేంద్రాల్లోకి తీసుకెళ్లకుండా క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేస్తున్నామన్నారు. పరీక్షలు ముగిసేంత వరకు కేంద్రాల సమీప ప్రాంతాల్లో జిరాక్స్‌, ప్రింటింగ్‌ సెంటర్లు మూసివేయాలన్నారు.

135 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్న 32,803 మంది విద్యార్థులు

అందరూ సహకరించాలి

ప్రతిష్టాత్మకమైన పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు అందరూ సహకరించాలి. కేంద్రాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎవరి స్థాయిలో వారు బాధ్యతగా పని చేయాలి. ఏ చిన్న పొరబాటుకూ తావివ్వొద్దు. చాలా కఠినమైన నిబంధనలు అమలులో ఉన్నాయనే సంగతిని ఎవరూ మరవొద్దు. – ఎం.ప్రసాద్‌బాబు, డీఈఓ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement