బాధితులకు అండగా ఉంటాం | - | Sakshi
Sakshi News home page

బాధితులకు అండగా ఉంటాం

Published Mon, Mar 17 2025 9:52 AM | Last Updated on Mon, Mar 17 2025 11:27 AM

బాధిత

బాధితులకు అండగా ఉంటాం

అనంతపురం ఎడ్యుకేషన్‌: ‘అనంతపురం రూరల్‌ పాపంపేట పొలం 106–1 సర్వే నంబరులోని 68 సెంట్లలో 40 ఏళ్లుగా నివాసం ఉంటున్న వారి భవనాలను చట్ట విరుద్ధంగా, హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ, ఎలాంటి సర్వే లేకుండా, నోటీసులు ఇవ్వ కుండా కూల్చి వేశారు. 150 మంది పోలీసులను తీసుకొచ్చి, ప్రైవేట్‌ సైన్యాన్ని మోహరించి దుర్మార్గంగా పేదల నివాసాలపై దాడులు చేశారు. బాధితులకు అండగా నిలబడి న్యాయం కోసం పోరాడతాం’ అని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తెలిపారు. ఆదివారం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రిటైర్డ్‌ జడ్జి కిష్టప్ప అక్కడికి వెళ్తే పక్కకు నెట్టేశారని, జడ్జిగా పని చేసిన వ్యక్తికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. పేదల ఆర్తనాదాల మధ్య పరిటాల కుటుంబం జయకేతనాలు ఎగుర వేస్తోందన్నారు. ‘ఏ కోర్టు ద్వారా భవనాలను కొట్టించారో అదే కోర్టు ద్వారా బాధితులకు స్థలాలు ఇప్పిస్తాం’ అని స్పష్టం చేశారు. నిబంధనల మేరకు మునిసిపాలిటీ పరిధిలోని భూమిని స్వాధీనం చేయాల్సి ఉండగా పాపంపేట పొలంలోని భూమిని స్వాధీనం చేశారన్నారు. ల్యాండ్‌ గ్రాబింగ్‌ కోర్ట్‌ 1990లో ఇచ్చిన ఆదేశాల ప్రకారం అనంతపురం నగరంలో 106 సర్వే నంబరులో 68 సెంట్లు శోత్రియందారులకు స్వాధీనం చేయమని హైకోర్టు సూచించిందన్నారు. ప్రభుత్వ ప్లీడరు, అడ్వొకేట్‌ జనరల్‌, స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్‌, ఆర్డీఓ, తహసీల్దార్‌ అందరూ కలిసి పాపంపేట పొలంలోని భూమిని స్వాధీనం చేశారన్నారు. ఒక 420 వెధవ తనకు సంబంధం లేని ఆస్తులపై కోర్టును తప్పుదోవ పట్టించారన్నారు. 8 మంది బాధితులు సివిల్‌ కోర్టులో ఫైల్‌ చేసిన కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. సహదేవనాయుడు అనే వ్యక్తికి 2023లో కోర్టు పర్మినెంట్‌ ఇంజెంక్షన్‌ ఇచ్చిందన్నారు. వీరి స్థలాల జోలికి వెళ్లొద్దని హైకోర్టు స్పష్టంగా చెప్పినా ధిక్కరించి తొలగించారని చెప్పారు. రూ. 2 వేల కోట్ల విలువైన భూముల్ని స్వాధీనం చేసుకోవాలనే కుట్రతో కట్టడాలను కూల్చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో ఆ చుట్టుపక్కల శోత్రియం భూముల్లో ఇళ్లు కట్టుకున్న వారు భయంతో తమను సంప్రదిస్తున్నారన్నారు. ‘డబ్బు చెల్లించాలి, లేదంటే ఇళ్లు కూల్చేస్తాం, భూములను ఖాళీ చేయిస్తాం’ అనే మెసేజ్‌ను వారందరికీ పరిటాల కుటుంబం పంపిందని ఆరోపించారు. ఇందుకు ఎమ్మెల్యే సునీత మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

అప్పట్లోనే కలెక్టర్‌కు విన్నవించా..

అనంతపురం రూరల్‌ తహసీల్దార్‌ మోహన్‌కుమార్‌కు ఈ కేసులో లొసుగులన్నీ తెలుసని, అందుకే ఏరికోరి ఆయనను ఇక్కడికి తెచ్చుకున్నారని ప్రకాష్‌ రెడ్డి తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బాధితుల తరఫున అప్పటి కలెక్టర్‌ను కలిసి వివరించగా, అప్పట్లో తహసీల్దార్‌ మోహన్‌కుమార్‌ మొత్తం రికార్డులు కలెక్టర్‌ ముందు ఉంచారన్నారు. మునిసిపాలిటీ పరిధి 106–1 సర్వే నంబరులోని 68 సెంట్లను స్వాధీనం చేయాలని కోర్టు తీర్పునిచ్చిందని, శ్రావణ్‌కుమార్‌ అడుగుతోంది పాపంపేట 106–1 సర్వే నంబరు భూమి అని, దీనికి ఆయనకు ఎలాంటి సంబంధం లేదంటూ అప్పట్లో అధికారులు హైకోర్టుకు తెలిపారన్నారు. ల్యాండ్‌ గ్రాబింగ్‌ కేసు మునిసిపాలిటీ భూములకు మాత్రమే వర్తిస్తుందనే విషయం తెలిసీ ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. కచ్చితంగా ఆర్డీఓ, తహసీల్దార్‌ను కోర్టుకు లాగుతామన్నారు. కలెక్టర్‌కు తెలిసి చేశారా.. తెలీక చేశారా.. ఫలితం మాత్రం అనుభవిస్తారన్నారు. 68 సెంట్ల స్థలాన్ని పరిటాల కుటుంబం స్వాధీనం చేసుకుని కాంప్లెక్స్‌ కడతారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయన్నారు. సమా వేశంలో జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్‌, ఎంపీపీ వరలక్ష్మీ, ఎంపీటీసీ సభ్యులు కురుబ వెంకటేశ్వర్లు, సందీప్‌యాదవ్‌, నాయకులు బండి పవన్‌, గోవిందరెడ్డి, నీరుగంటి నారాయణరెడ్డి, మాదన్న, గోపాల్‌రెడ్డి,అంజనరెడ్డి, ఎర్రిస్వామి, నిఖిల్‌యాదవ్‌ పాల్గొన్నారు.

పేదల ఆర్తనాదాల మధ్య

పరిటాల కుటుంబం

జయకేతనాలు

హైకోర్టు ఆదేశాలకు పూర్తి

విరుద్ధంగా కూల్చివేతలు

మాజీ ఎమ్మెల్యే

తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
బాధితులకు అండగా ఉంటాం 1
1/1

బాధితులకు అండగా ఉంటాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement