పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులు
అనంతపురం అర్బన్: ఆంధ్రరాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ పేర్కొన్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో పొట్టిశ్రీరాములు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రోద్యమంలో పొట్టిశ్రీరాములు చురుగ్గా పాల్గొన్నారన్నారు. తెలుగు మాట్లాడే వారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలంటూ మద్రాసులో 1952 అక్టోబరు 19న బులుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహార దీక్ష ప్రారం భించి డిసెంబరు 15న అసువులు బాసారన్నారు. ప్రతిఒక్కరూ ఆ మహనీయుడి బాటలో నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్న, డీఆర్‌ఓ ఎ.మలోల, తదితరులు పాల్గొన్నారు.
అమ్మూ... ఇక నేను బతకలేనమ్మా!
● బేకరీ షాపు నిర్వాహకుడి ఆత్మహత్య
బత్తలపల్లి: బేకరీ వ్యాపారం సరిగా జరగకపోవడంతో కుమార్తె వివాహం, కుమారుడి చదువుకు డబ్బు ఎలా సమకూర్చాలో తెలియక షాపు నిర్వాహకుడు సతమతమయ్యాడు. రోజూ ఇవే ఆలోచనలు చేసి.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కుమార్తెకు వీడియో కాల్ చేసి ‘అమ్మూ.. ఇక నేను బతకలేనమ్మా’ అంటూ చెప్పి ఉరివేసుకున్నాడు. వివరాలు.. కేరళకు చెందిన పరంబత్ జయప్రకాష్ (55) 35 ఏళ్ల క్రితం శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లికి వలస వచ్చాడు. తొలుత ఓ బేకరీ షాపులో పనిచేశాడు. తర్వాత కదిరి రోడ్డులో సొంతంగా ‘మైసూర్ బేకరీ’ షాపు ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడే లక్ష్మీకళ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీరికి కుమార్తె రిన్షా, కుమారుడు రోహన్ ఉన్నారు. రిన్షా ప్రస్తుతం జపాన్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుండగా.. రోహన్ బెంగళూరులో బీటెక్ ఫస్టియర్ చదువుతున్నాడు. కొంత కాలంగా బేకరీ షాపులో వ్యాపారం సరిగా జరగకపోవడంతో జయప్రకాష్ ఆందోళన చెందుతుండేవాడు. దీనికితోడు రోడ్డు విస్తరణలో భాగంగా దుకాణం తొలగిస్తారని భయపడేవాడు. ఈ విషయాలను భార్యతో చెప్పుకుని మదనపడుతుండేవాడు. అమ్మూ (రిన్షా) వివాహం ఎలా చేయాలి, అప్పూ (రోహన్) చదువులకు డబ్బు ఎలా సమకూర్చాలో అర్థం కావడం లేదంటూ బాధ పడేవాడు. ఎప్పటికప్పుడు భార్య ధైర్యం చెప్తూ వస్తోంది. బెంగళూరులో తన బంధువుల ఇంట్లో జరుగుతున్న సీమంతం కార్యక్రమానికి లక్ష్మీకళ శనివారం వెళ్లింది. ఇంట్లో ఒక్కడే ఉన్న జయప్రకాష్ ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో కుమార్తెకు వీడియో కాల్ చేసి ‘నేను చనిపోతానమ్మా.. ఇక బతకను’ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. వెంటనే ఆమె బెంగళూరులో ఉన్న తల్లికి విషయం చెప్పింది. బత్తలపల్లిలోని ఇంటి సమీపంలో ఉన్న సాంబశివుడుకు లక్ష్మీకళ ఫోన్ చేసి అప్రమత్తం చేసింది. అతడు వెళ్లి చూసేసరికి జయప్రకాష్ బేకరీ షెడ్‌లో ఉరికివేలాడుతూ నిర్జీవంగా కనిపించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులు
Comments
Please login to add a commentAdd a comment