దగాకోరుపై దండెత్తిన అన్నదాతలు
కణేకల్లు: కొనుగోలు చేసిన పంట ఉత్పత్తులకు డబ్బు కట్టకుండా అలసత్వం వహించిన ఓ దగాకోరుపై అన్నదాతలు దండెత్తారు. వివరాలు.. మండలంలోని పెనకలపాడు గ్రామానికి చెందిన వ్యాపారి క్రిష్ణారెడ్డి రైతుల నుంచి శనగలను కొనుగోలు చేసి రూ.4 కోట్లకు పైగా శఠగోపం పెట్టాడు. బాధిత రైతులు జిల్లా ఎస్పీని కలిసి న్యాయం చేయాలని వేడుకోగా.. క్రిష్ణారెడ్డి దారికొచ్చాడు. దశలవారీగా డబ్బు చెల్లిస్తానని హామీ ఇచ్చాడు. ఇందులో భాగంగా ఈనెల 9న రూ. కోటి మేర రైతులకివ్వాల్సి ఉంది. అయితే, డబ్బు కోసం ఆ రోజు నుంచి రైతులు అతని చుట్టూ తిరుగుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. గురువారం దాటవేసేలా మాట్లాడటంతో బాధిత రైతులకు కడుపు మండిపోయింది. క్రిష్ణారెడ్డి, అతని కుమారుడు సోమశేఖర్‌ను గ్రామంలో ఉన్న రాములోరి ఆలయం వద్దకు పిలుచుకొచ్చి కట్టపై కూర్చోబెట్టారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకూ వదల్లేదు. విషయం తెలుసుకొన్న ఎస్‌ఐ నాగమధు.. ఏఎస్‌ఐ ఈశ్వరయ్య, పోలీసులను గ్రామానికి పంపించారు. గొడవల్లేకుండా సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ క్రమంలోనే తండ్రీకొడుకులు మాట్లాడుతూ... శ్రీరామనవమి తర్వాత కొంత డబ్బిస్తానని చెప్పడంతో రైతులు వారిని వదిలిపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment