పార్టీల ప్రతినిధులతో ప్రతి నెలా సమావేశం
అనంతపురం అర్బన్: ‘ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇకపై ప్రతినెలా రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తాం. సలహాలు, సూచనలు స్వీకరిస్తాం’ అని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెలా మొదటి వారంలో సమావేశం ఉంటుందన్నారు. ఓటరు జాబితా సవరణ, తదితర అంశాలపై చర్చించి సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు. చర్చించిన అంశాలపై నివేదికలను 20వ తేదీలోపు ప్రధాన ఎన్నికల అధికారికి పంపుతామన్నారు. ఓటరుగా నమోదు, జాబితాలో ఓటు తొలగింపు, వివరాల మార్పు నిరంతర ప్రక్రియ అని, ఇందుకు సంబంధించిన దరఖాస్తులపై ఎప్పటికప్పుడు విచారణ చేసి పరిష్కరిస్తామన్నారు. పార్లమెంటరీ ఓటర్ల జాబితా, ఎలక్టోరల్ రోల్స్ తయారీ, ఎన్నికల చట్టాలు, నియమాల్లో సవరణలు, ఎన్నికల సేవల ఫారాల్లో సవరణలు, ఓటర్ల నమోదు నియమాలు, 1960 కింద సూచించిన ఫాంలు, బల్క్ అప్లికేషన్ సూచనల సమర్పణ, డెమోగ్రాఫికల్ సిమిలర్ ఎంట్రీలు (డీఎస్‌ఈ), బీఎల్‌ఏల నియామకం, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ తదితర వివరాలతో కూడిన నివేదికలను ఇస్తామన్నారు. ప్రజల్లో నమ్మకాన్ని పెంచే విధంగా ఎన్నికలకు సంబంధించిన ప్రతి ప్రక్రియ సజావుగా జరిగేలా అందరూ సహకరించాలన్నారు. సమావేశంలో ఎన్నికల విభాగం తహసీల్దారు యుగేశ్వరిదేవి, డీటీ కనకరాజు, ఐటీ అసిస్టెంట్ శివ, పార్టీల ప్రతినిధులు సోమశేఖర్‌రెడ్డి, ఇమాంవలి, నారాయణస్వామి, కిరణ్‌కుమార్, బాలరంగయ్య, రామాంజినేయులు, అంజయ్య, మసూద్‌ఆలీ, తదితరులు పాల్గొన్నారు.
ఓటరు జాబితాపై చర్చించి
సలహాలు స్వీకరిస్తాం
ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో
నమ్మకాన్ని పెంచుదాం
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినోద్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment