
అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్
అనంతపురం: అంతర్‌జిల్లా దొంగల ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.16 లక్షల విలువైన 18 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాలను మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ డీవీ రమణమూర్తి వెల్లడించారు. అనంతపురంలోని భవానీనగర్‌లో నివాసముంటున్న వనరస జితేంద్ర అలియాస్ సిద్ధు, షేక్ తౌహిద్ అలియాస్ సోనూ, ఇందిరానగర్‌కు చెందిన మైనర్ బాలుడు, శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం ముత్యాల చెరువు గ్రామానికి చెందిన నల్లనాచప్పగారి గణేష్, ముత్యాలచెరువు గ్రామానికి చెందిన నూర్ మహమ్మద్ వ్యసనాలకు బానిసలుగా మారి, తమ జల్సాలు తీర్చుకునేందుకు మూడు బృందాలుగా ఏర్పడి అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో ద్విచక్ర వాహనాలను అపహరించేవారు. వీరిలో జితేంద్రపై అనంతపురం రెండు, మూడు, రూరల్, గుత్తి పీఎస్ పరిధిలో మొత్తం 8 కేసులున్నాయి. ఇది వరకే సాగించిన దొంగతనాలకు సంబంధించి 2 కేసులున్నాయి. కార్పెంటర్‌గా పనిచేస్తున్న తౌహిద్, తన స్నేహితుడు (మైనర్)తో కలసి ముఠాగా ఏర్పడి ద్విచక్రవాహనాలను అపహరించేవాడు. వీరిపై అనంతపురం వన్‌టౌన్, ధర్మవరం టూటౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిల్లో చెరో 6 కేసులున్నాయి. మైనర్‌పై రెండు బైక్ చోరీ కేసులున్నాయి. బేల్దారి నల్లనాచప్పగారి గణేష్, బైక్ మెకానిక్ నూర్ మహమ్మద్ ఇద్దరూ ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో మంచి స్నేహితులయ్యారు. జల్సాలకు అవసరమైన డబ్బు కోసం ద్విచక్ర వాహనాలను అపహరించేవారు. వీరిపై మొత్తం ఆరు కేసులుండగా ఇందులో వైఎస్సార్ జిల్లా లో ఐదు, అనంతపురం జిల్లాలో ఒకటి ఉన్నాయి. నిందితులు మంగళవారం అనంతపురంలోని ఎస్‌జేఆర్ ఫంక్షన్ హాలు వద్ద తచ్చాడుతుండగా అనంతపురం వన్‌టౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్, త్రీ టౌన్ సీఐ శాంతిలాల్, సీసీఎస్ సీఐలు ఇస్మాయిల్, జైపాల్‌రెడ్డి గుర్తించి అరెస్ట్ చేశారు. మైనర్‌ను సీడబ్ల్యూసీ ఎదుట హాజరుపరిచారు. మిగిలిన వారిని న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.