
నేటి నుంచి స్లాట్ బుకింగ్ విధానం
అనంతపురం టౌన్: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల్లో శుక్రవారం నుంచి స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు జిల్లా రిజిస్ట్రార్ భార్గవ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. www.igrs.ap.gov వెబ్ సైట్‌లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు స్లాట్ బుక్ చేసుకోవచ్చన్నారు. కావాల్సిన తేదీ, సమయాల్లో ముందుగానే స్లాట్ బుక్ చేసుకొని కార్యాలయానికి వెళ్తే కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చన్నారు. ఆఫ్‌లైన్‌లో సైతం రిజిస్ట్రేషన్లు జరుగుతాయని, స్థిరాస్తి కొనుగోలు, అమ్మకందార్లు గమనించాలని ఆయన సూచించారు.
కించపరిచే పోస్టులు
పెడితే కఠిన చర్యలు
అనంతపురం: సామాజిక మాధ్యమాల్లో ఏ సామాజిక వర్గాన్నైనా కించపరిచే పోస్టులు పెడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ పి. జగదీష్ హెచ్చరించారు. కులాల మధ్య విద్వేషాలు సృష్టించే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు, దుష్ప్రచారం, ఇతరుల మనోభావాలు దెబ్బతీసేలా పోస్టులు పెట్టే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ (ట్విట్టర్) తదితర సామాజిక మాధ్యమాల్లో అవమానకర రీతిలో పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా వివాదాస్పద విషయాలు, తప్పు దారి పట్టించే ఫేక్ న్యూస్ పెట్టినా, షేర్ చేసినా చట్టరీత్యా నేరమన్నారు. సంబంధిత గ్రూప్ అడ్మిన్‌ను బాధ్యుల్ని చేస్తూ కేసులు నమోదు చేస్తామన్నారు.
ఆసియా పారా త్రోబాల్ పోటీల్లో సత్తా
అనంతపురం: కంబో డియా దేశంలో గత నెల 28 నుంచి 30 వరకు నిర్వహించిన తొలి ఆసియా పారా త్రోబాల్ పోటీల్లో జిల్లాకు చెందిన యువకుడు సత్తా చాటాడు. దేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన వెన్నపూస రొషి రెడ్డి ఏకంగా రజత పతకాన్ని సాధించాడు. ఈ మేరకు త్రో బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఆల్బర్ట్ ప్రేమ్ కుమార్ తెలిపారు. కంబోడియా మొదటి స్థానం, శ్రీలంక రెండో స్థానం, భారతదేశం మూడో స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వెన్నపూస రొషిరెడ్డికి అభినందనలు వెల్లువెత్తాయి.
రైతులందరికీ విశిష్ట
గుర్తింపు సంఖ్య తప్పనిసరి
పుట్లూరు: రైతులందరికీ విశిష్ట గుర్తింపు సంఖ్య తప్పనిసరి అని జిల్లా వ్యవసాయ అధికారిణి ఉమామహేశ్వరమ్మ అన్నారు. గురువారం ఆమె మండలంలోని పుట్లూరు, కడవకల్లు, కోమటి కుంట్ల రైతు సేవా కేంద్రాలను అకస్మిక తనిఖీ చేశారు. ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ల పక్రియను వేగ వంతం చేయాలని సిబ్బందికి సూచించారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ చేయించుకుని విశిష్ట గుర్తింపు సంఖ్యను పొందాలన్నారు. కార్యక్రమంలో ఏడీఏ చెంగలరాయుడు, ఏఓ కాత్యాయని, ఏఈఓ హరి, సిబ్బంది పాల్గొన్నారు.

నేటి నుంచి స్లాట్ బుకింగ్ విధానం