
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ రూ.వేల కోట్లతో ప్రభుత్వాస్పత్రులను తీర్చిదిద్దుతూ కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం వైద్య సేవల్లో ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించడంలో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ఫిర్యాదులను సైతం స్వీకరించేలా ఇప్పటికే విస్తృత ప్రచారం పొందిన 104 టోల్ ఫ్రీ నంబర్ సేవలను వినియోగించుకునేలా ఏర్పాట్లు చేసింది.
తొలుత ఐదు సేవలతో
డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ – ఆరోగ్య ఆసరా, 104 మొబైల్ మెడికల్ యూనిట్స్(ఎంఎంయూ), 108 అంబులెన్స్, వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్, మహాప్రస్థానం.. ఈ ఐదు సేవలకు సంబంధించి తొలుత ఫిర్యాదులను స్వీకరించనున్నారు. అనంతరం ఇతర సేవలకు విస్తరించనున్నారు.
స్పందనతో అనుసంధానం
104 కాల్‌సెంటర్ ద్వారా వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించిన సేవలు, సమగ్ర సమాచారాన్ని ఇప్పటికే ప్రజలకు అందిస్తున్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో 30 మంది సిబ్బందితో పనిచేసే కాల్‌సెంటర్‌కు నిత్యం వెయ్యి వరకూ ఫోన్ కాల్స్ వస్తుంటాయి. ఫిర్యాదులు స్వీకరించేందుకు విశాఖపట్నంలో కాల్ సెంటర్ ఏర్పాటైంది. ఇక్కడ 30 మంది విధుల్లో ఉంటారు. ఫిర్యాదుల కాల్‌సెంటర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్పందన’ ప్రజాసమస్యల పరిష్కార వేదిక డ్యాష్‌బోర్డుకు అనుసంధానించారు. కాల్‌సెంటర్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదు, పరిష్కారానికి సంబంధించి డ్యాష్‌బోర్డ్ ద్వారా ఉన్నత స్థాయిలో పర్యవేక్షిస్తారు.
ఎస్‌వోపీ రూపకల్పన
కాల్ సెంటర్‌కు అందే ఫిర్యాదులను ఎంత సమయంలోగా పరిష్కరించాలి? ఎవరెవరు బాధ్యత వహించాలి? అనే అంశాలతో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌వోపీ) రూపొందించారు. గత మూడేళ్లుగా ఐదు సేవలకు సంబంధించిన ఫిర్యాదులను నిపుణుల కమిటీ పరిశీలించింది. సమస్య తీవ్రత ఆధారంగా ఫిర్యాదుల పరిష్కార సమయాన్ని అత్యంత వేగం, వేగం, సాధారణం అని మూడు విభాగాలుగా విభజించారు.
అత్యంత వేగం పరిధిలోకి వచ్చే ఫిర్యాదులను గంట లోపు పరిష్కరిస్తారు. వేగం పరిధిలోకి వచ్చే ఫిర్యాదులను 24 నుంచి 72 గంటలు, సాధారణ పరిధిలోకి వచ్చే ఫిర్యాదులను 7 నుంచి 21 రోజుల్లోగా పరిష్కరించాలని నిర్దేశించారు. దీనిపై కాల్‌సెంటర్ సిబ్బంది, ఆరోగ్యశ్రీ, 104 ఎంఎంయూ, 108 జిల్లా కోఆర్డినేటర్లు, టీమ్‌లీడర్లు తదితరులకు శిక్షణ ఇచ్చారు.
వచ్చే వారం ప్రారంభం
ఐదు రకాల సేవలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే శిక్షణ కార్యక్రమాలు ముగిశాయి. ఇబ్బందులు ఎదురైతే 104కు కాల్ చేయవచ్చు. వచ్చే వారం ఫిర్యాదుల స్వీకారం ప్రారంభిస్తాం. అంబులెన్స్‌లు, ఆరోగ్య మిత్ర కియోస్క్‌లపై ఫిర్యాదుల నంబర్ ప్రదర్శించేలా స్టిక్కర్లు సిద్ధం చేశాం. వైద్య సేవలు పొందడంలో ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకూడదన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా చర్యలు చేపట్టాం.
– వినయ్‌చంద్, ఆరోగ్యశ్రీ సీఈవో
ఫిర్యాదులు ఇలా...
► నిర్దేశించిన ఐదు సేవలకు సంబంధించి ఫిర్యాదు చేయాలనుకుంటే 104కి కాల్ చేసి 1వ నంబర్ నొక్కాలి.
► అనంతరం కాల్ సెంటర్ సిబ్బంది లైన్‌లోకి వచ్చి ఫిర్యాదు స్వీకరిస్తారు.
► ఉదాహరణకు ఏదైనా ఆస్పత్రిలో ఆరోగ్య మిత్ర అందుబాటులో లేకుంటే ఈ ఫిర్యాదు అత్యంత వేగంగా స్పందించాల్సిన విభాగం పరిధిలోకి వస్తుంది. ఇది గంటలోగా పరిష్కరించాల్సి ఉంటుంది. ఫిర్యాదు అందిన వెంటనే ఫోన్, ఎస్‌ఎంఎస్ ద్వారా ఆరోగ్య మిత్ర టీమ్ లీడర్‌కు సమాచారం ఇస్తారు.
ఒకవేళ అక్కడ స్పందించడంలో ఆలస్యం అయితే వెంటనే జిల్లా ఆరోగ్యమిత్ర కోఆర్డినేటర్, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్‌కు ఫిర్యాదు వెళుతుంది. గంటలోగా ఫిర్యాదు పరిష్కారం కాకుంటే ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్టు అధికారుల దృష్టికి వచ్చేలా చర్యలు చేపట్టారు. సకాలంలో ఫిర్యాదు పరిష్కరించకుంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటారు.
పలు సమస్యలు – వాటి పరిష్కారం ఇలా
ఆరోగ్య శ్రీ
అత్యంత వేగంగా పరిష్కరించాల్సిన ఫిర్యాదులు (గంటలోపు)
► ఆరోగ్యమిత్ర అందుబాటులో లేకపోవడం
► ఆరోగ్య శ్రీ కింద అడ్మిషన్, చికిత్స అందించడానికి ఆస్పత్రులు నిరాకరించడం
వేగంగా పరిష్కరించాల్సిన ఫిర్యాదులు (24 గంటల్లో)
► హెల్త్ కార్డు డీయాక్టివేషన్‌లో ఉండటం
► అడ్మిషన్, చికిత్స సమయంలో డబ్బు డిమాండ్ చేయడం
సాధారణంగా పరిష్కరించే ఫిర్యాదులు (7 నుంచి 21 రోజుల్లో)
► పోస్ట్ ఆపరేషన్, ఫాలో అప్‌లో సమస్యలు
► హెల్త్‌కార్డు అందకపోవడం
► కుటుంబసభ్యుడిని కార్డులో చేర్చడం, తొలగించడం
► ఆరోగ్య శ్రీ కింద చికిత్స పొందుతున్న రోగి మరణించడం, ఇతర ఫిర్యాదులు
ఆరోగ్య ఆసరా
వేగంగా పరిష్కరించాల్సిన ఫిర్యాదులు (24 గంటల్లో)
► బ్యాంక్ ఖాతాలో ఆసరా డబ్బు జమకాకపోవడం
► ఆసరాకు దరఖాస్తు చేయడంలో ఆరోగ్యమిత్ర ఆలస్యం చేయడం
సాధారణంగా పరిష్కరించే ఫిర్యాదులు (7 నుంచి 21 రోజుల్లో)
► మంజూరైన దానికంటే తక్కువ భృతి అందడం, ఇతర ఫిర్యాదులు
104 ఎంఎంయూ
వేగంగా పరిష్కరించాల్సిన ఫిర్యాదులు (24 గంటల్లో)
► గ్రామానికి 104 ఎంఎంయూ రాకపోవడం
► ఆలస్యంగా వచ్చి, త్వరగా వెళ్లిపోవడం
► వైద్యపరీక్షలు చేయకపోవడం, వైద్యులు అందుబాటులో లేకపోవడం
సాధారణంగా పరిష్కరించే ఫిర్యాదులు (7 నుంచి 21 రోజుల్లో)
► వైద్యసేవలు అందించడానికి డబ్బు డిమాండ్ చేయడం
► సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం
► పరికరాలు పనిచేయకపోవడం, ఇతర సమస్యలు
108 అంబులెన్స్
వేగంగా పరిష్కరించాల్సిన ఫిర్యాదులు (24 గంటల్లో)
► అంబులెన్స్ ఆలస్యంగా రావడం, సేవలు అందించడానికి తిరస్కరించడం
సాధారణంగా పరిష్కరించే ఫిర్యాదులు (7 నుంచి 21 రోజుల్లో)
► సిబ్బంది డబ్బులు డిమాండ్ చేయడం
► అంబులెన్స్‌లో ఆక్సిజన్, మందులు, పరిశుభ్రంగా లేకపోవడం
► సిబ్బంది ప్రవర్తన, ఇతర సమస్యలు
మహాప్రస్థానం
వేగంగా పరిష్కరించాల్సిన ఫిర్యాదులు (24 గంటల్లో)
► డ్రైవర్ మద్యం తాగి ఉండటం
► వాహనం అందుబాటులో లేకపోవడం, గమ్యస్థానానికి చేర్చడానికి నిరాకరించడం
సాధారణంగా పరిష్కరించే ఫిర్యాదులు (7 నుంచి 21 రోజుల్లో)
► సిబ్బంది ప్రవర్తన, డబ్బు డిమాండ్ చేయడం, ఇతర ఫిర్యాదులు
తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్
వేగంగా పరిష్కరించాల్సిన ఫిర్యాదులు (24 గంటల్లో)
► వాహనాలు అందుబాటులో లేకపోవడం, ఆలస్యం చేయడం, తరలింపునకు నిరాకరించడం
సాధారణంగా పరిష్కరించే ఫిర్యాదులు (7 నుంచి 21 రోజుల్లో)
► డబ్బు డిమాండ్ చేయడం, వాహనం పరిశుభ్రంగా లేకపోవడం, ఇతర సమస్యలు
Comments
Please login to add a commentAdd a comment