తొలిరోజే రూ.1,412 కోట్ల పింఛను సొమ్ము పంపిణీ | 1412 Crore Pension Disbursement On December 1st | Sakshi
Sakshi News home page

తొలిరోజే రూ.1,412 కోట్ల పింఛను సొమ్ము పంపిణీ

Published Wed, Dec 2 2020 3:01 AM | Last Updated on Wed, Dec 2 2020 3:01 AM

1412 Crore Pension Disbursement On December 1st - Sakshi

పింఛన్‌ పొందిన ఆనందంలో గుంటూరు సీతమ్మ కాలనీకి చెందిన రాజేశ్వరమ్మ

సాక్షి, అమరావతి: అవ్వాతాతలకు పింఛను డబ్బులు ఒకటో తేదీన ఠంఛన్‌గా అందాయి. మంగళవారం తెలవారుతుండగానే లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పింఛన్ల పంపిణీ ప్రారంభించిన వలంటీర్లు తొలిరోజు 58,22,120 మందికి రూ.1,412 కోట్లు పంపిణీ చేశారు. మొదటిరోజే 94.36 శాతం మందికి పింఛను డబ్బులు అందాయి. లబ్ధిదారులందరికీ పింఛను తప్పకుండా అందాలనే లక్ష్యంతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం డిసెంబర్‌ నెల నుంచి మూడురోజులు పంపిణీ చేయాలని కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నెల నుంచి 1, 2, 3 తేదీల్లో వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులకు ఆదేశాలు జారీచేసింది. ఏవైనా కారణాల వల్ల ఈ మూడు రోజుల్లో తీసుకోలేకపోయినవారికి ఆయా వార్డు, గ్రామ సచివాలయాల్లో ఇచ్చే ఏర్పాట్లు చేసేందుకు అధికారులు పరిశీలిస్తున్నారు. 

► తొలిరోజు ఉదయం 8.30 గంటలకే 58 శాతం పంపిణీ పూర్తవగా, మధ్యాహ్నం 3 గంటల కల్లా 90 శాతం పంపిణీ పూర్తయింది. 
► ఒకటి, రెండు, మూడు నెలలుగా పింఛను డబ్బులు తీసుకోలేకపోయిన 2,14,464 మందికి మంగళవారం పాత బకాయిలతో కలిపి ఈ నెల పింఛను అందజేశారు. 
► 2,42,293 మందిలో 2,01,456 మంది పాత బకాయితో కలిపి రెండునెలల పింఛను డబ్బు తీసుకున్నారు. 18,590 మందికిగాను 10,974 మంది రెండు నెలల బకాయిలతో కలిపి మొత్తం మూడునెలల డబ్బులు, 7,462 మందికిగాను 2,034 మంది మూడునెలల బకాయిలతో కలిపి మొత్తం నాలుగు నెలల డబ్బులు అందుకున్నారు. బుధ, గురువారాల్లో పింఛన్ల పంపిణీ  కొనసాగుతుంది. 

90 కిలోమీటర్లు వెళ్లి పింఛను పంపిణీ
నెల్లిమర్ల రూరల్‌/విజయపురం: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం గ్రామానికి చెందిన వలంటీరు రాంబాబు విశాఖపట్నం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధురాలు బెల్లాన రాజమ్మకు పింఛను అందజేశారు. రాజమ్మ పక్షవాతంతో బాధపడుతూ విశాఖపట్నంలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాంబాబు మంగళవారం గ్రామంలో పింఛన్లు పంపిణీ చేసిన తరువాత దాదాపు 90 కిలోమీటర్లు ప్రయాణించి విశాఖపట్నంలోని ఆదిత్యా ఆస్పత్రిలో రాజమ్మకు పింఛను సొమ్ము అందజేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆస్పత్రిలోనే పింఛను ఇవ్వడంతో రాజమ్మ, ఆమె కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. విశాఖ వెళ్లి పింఛన్‌ అందజేసిన వలంటీర్‌ను ఎంపీడీవో రాజ్‌కుమార్, ఈవోపీఆర్డీ భానోజీరావు, గ్రామస్తులు అభినందించారు. 

చెన్నై వెళ్లి పింఛను ఇచ్చిన వలంటీర్‌ 
చిత్తూరు జల్లా విజయపురం మండలంలోని ఆలపాకం గ్రామానికి చెందిన సుబ్బమ్మ మూడునెలల కిందట చెన్నైలో బంధువుల ఇంటికి వెళ్లారు. లాక్‌డౌన్‌ కారణంగా తిరిగి రాలేకపోయారు. పింఛను కూడా తీసుకోలేదు. ఈ విషయం తెలుసుకున్న వలంటీర్‌ చిన్నరాజ్‌ తన సొంత ఖర్చుతో ద్విచక్ర వాహనం మీద చెన్నైలోని రెడ్‌హిల్స్‌కి వెళ్లి సుబ్బమ్మకు రెండునెలల బకాయిలతో సహా మూడునెలల పింఛను సొమ్ము అందజేశారు. 

ఒంగోలు లబ్ధిదారుకు తిరుపతి ఆస్పత్రిలో..
ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలుకు చెందిన పి.జాషువా తిరుపతి స్విమ్స్‌ ఆస్పత్రిలో డయాలసిస్‌ చికిత్స పొందుతున్నాడు. తిరుపతి 38వ వార్డు సంక్షేమ కార్యదర్శి నీలమణి మంగళవారం ఉదయం స్విమ్స్‌ డయాలసిస్‌ వార్డులోకి వెళ్లి జాషువాకు పింఛను సొమ్ము అందజేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement